Share News

కౌన్‌ బనేగా ఎమ్మెల్సీ?

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:34 AM

శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాన్ని దక్కించుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్‌ మద్దతుతో మరోసారి బరిలో దిగితే, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు.

కౌన్‌ బనేగా ఎమ్మెల్సీ?

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉపాధ్యాయ సంఘాలు

మరోసారి గెలవాలనే లక్ష్యంతో యూటీఎఫ్‌

పూర్వవైభవం కోసం పీఆర్టీయూ

బోణీ కొట్టాలని బీజేపీ ప్రయత్నం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ): శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానాన్ని దక్కించుకునేందుకు ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్‌ మద్దతుతో మరోసారి బరిలో దిగితే, పీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి టీపీఆర్టీయూ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్‌ మద్దతుతో పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పులి నరోత్తమ్‌రెడ్డి పోటీ చేస్తున్నా రు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవగా, విశ్రాంత డీఈవో చంద్రమోహన్‌ మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఇంకా కొందరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. కీలక నేతలే పోటీలో ఉండటం, వీరంతా గెలుపుకోసం పోటాపోటీ వ్యూహాలు అమలు చేస్తుండటంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

శ్రమిస్తున్న అభ్యర్థులు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపుకోసం సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీపీఆర్టీయూ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన హైస్కూల్‌ ఉపాధ్యాయులతోపాటు, జూనియర్‌ లెక్చరర్లు, ఆశ్రమ, గురుకుల, కేజీబీవీ, ఆశ్రమ, భాషా పండిట్‌, వ్యా యామ ఉపాధ్యాయ, ఎయిడెడ్‌ స్కూళ్లల్లో పనిచేసే ఉపాధ్యాయుల మద్దతు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపాధ్యాయరంగ సమస్యలపై తాము ఇప్పటికే చేసిన పోరాటాలు, ఉద్యమాలు, సాధించిన విజయాలు, భవిష్యత్‌ కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు పంచుతున్నారు. క్షేత్రస్థాయి సంఘాలసభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉధృతంగా ప్రచారం చేస్తున్నా రు. సోషల్‌ మీడియాలో విస్తృతస్థాయిలో పోస్టులు పెడుతూ ప్రచారం సాగిస్తున్నారు.

జిల్లాల వారీగా ఓటర్లు, పోలింగ్‌ స్టేషన్లు ఇలా..

ఉమ్మడి ఖమ్మం-వరంగల్‌-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 12జిల్లాలో 24,905 మంది ఉపాధ్యాయ ఓటర్లున్నారు. అయితే సోమవారం తుది జాబితా వెల్లడికానుంది. దీంతో కొన్ని ఓట్ల సంఖ్య పెరగనుంది. అత్యధికంగా హన్మకొండ జిల్లాలో 5,098 ఓట్లు ఉండగా రెండో స్థానంలో నల్లగొండ జిల్లాలో 4483 ఓట్లున్నాయి. మూడో స్థానంలో 3,955 ఓట్లతో ఖమ్మం జిల్లా ఉంది. అత్యంత తక్కువగా ఉన్న ఓట్లు సిద్ధిపేట కేవలం 163 మాత్రమే ఓట్లు ఉన్నాయి.

నేటితో ముగియనున్న గడువు

నల్లగొండ- ఖమ్మం- వరంగల్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేసేందుకు నేటి(సోమవారం)తో గడువు ముగియనుంది. ఈ స్థానానికి ఇప్పటికే 13మంది అభ్యర్థులు 19 నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం పీఆర్టీయూ బలపర్చిన శ్రీపాల్‌ రెడ్డి, బీజేపీ అభ్యర్థి నరోత్తమ్‌రెడ్డి ర్యాలీలు నిర్వహించి నామినేషన్‌ వేసేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు సిట్టింగ్‌ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, పీసీసీ అధికారిక ప్రతినిధి హర్షవర్ధన్‌ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

ఇంకా రాని కాంగ్రెస్‌ నిర్ణయం

ఎమ్మెల్సీ ఎన్నికలో ఇప్పటివరకు బీజేపీ మాత్రమే తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి టీపీఆర్టీయూ అభ్యర్థిగా బరిలోకి వచ్చినా కాంగ్రెస్‌ అధికారికంగా మద్దతివ్వలేదు. తనకి అధికారికంగా మద్దతివ్వాలని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మూ డు ఉమ్మడి జిల్లాల మంత్రులకు హర్షవర్ధన్‌ ఇప్పటికే విన్నవించినా పార్టీ నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు పీఆర్టీయూ అభ్యర్థి సైతం కాం గ్రెస్‌ మద్దతుకోసం ప్రయత్నిస్తున్నారని ఈ పరిస్థితిలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయం పై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో అప్పటి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌కి మద్దతు ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ఈఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది.

జిల్లా పోలింగ్‌ ఓటర్లు

బూత్‌లు

సిద్ధిపేట 4 163

జనగామ 12 221

హన్మకొండ 15 5098

వరంగల్‌ 13 2225

మహబుబాబాద్‌ 16 1618

భూపాలపల్లి 7 323

ములుగు 9 612

భద్రాద్రి 23 1949

ఖమ్మం 24 3955

యాదాద్రి 17 921

సూర్యాపేట 23 2637

నల్లగొండ 37 4483

మొత్తం 200 24905

Updated Date - Feb 10 , 2025 | 12:34 AM