అవయవదానానికి ముందుకు రావాలి
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:03 AM
ఆపదలో ఉన్న వారికి జీవం పోసేందు కు, మృత్యువుకు దగ్గరైన వారి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు.

కలెక్టర్ హనుమంతరావు
భువనగిరి టౌన్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యో తి): ఆపదలో ఉన్న వారికి జీవం పోసేందు కు, మృత్యువుకు దగ్గరైన వారి అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భువనగిరి జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు. రక్త, అవయవదానాల తో ప్రాణదాతలు కావాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ రక్తదానం చేయాలని, అనుకోని ప్రమాదాలతో గాయపడి, మృత్యువుకు దగ్గరైన వారి అవయావాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ఔదార్యం చూపాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో రక్తనిల్వలు పెంచేందుకు త్వరలోనే మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, మరిన్ని వైద్య సేవల పెంపే లక్ష్యంగా భవన నిర్మాణం తదితర పనులను చేపట్టినట్లు తెలిపారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది శ్రద్ధ చూపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్ శ్రీశైల చిన్నానాయక్, సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ పరిశీలన
ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ను పకడ్బందీగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. పోలింగ్ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
గర్భిణుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
(భువనగిరి కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి): గర్భిణుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గర్భిణుల్లో హైరిస్క్ కేసులపట్ల మహిళా ఆరోగ్య కార్యకర్తలు తీసుకోవాల్సిన అంశంపై ఆర్మన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం జరిగేలా ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శిల్పిని, పీవో డాక్టర్ సాయిశోభ, వి.అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
(ఆలేరు, ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు జనని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22న టాలెంట్ టెస్ట్ నిర్వహించనుండడం అభినందనీయమని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. పరీక్షల కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ భాస్కర్, పేరపు ఆనంద్, శ్రీకాంత్, సంపత్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.