నల్లగొండలో నగరోత్సవం
ABN , Publish Date - Feb 02 , 2025 | 12:34 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
చెర్వుగట్టు జాతరలో నేడు మొదటి ఘట్టం
5న తెల్లవారు జామున కల్యాణం
నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నల్లగొండలో నిర్వహించే నగరోత్సవంతో ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఈ నెల 4న పాంచాహ్నిక దీక్షతో చెర్వుగట్టు ఆలయంలో ఉత్సవ పూజా కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. 5న (బుధవారం) తెల్లవారుజామున కల్యాణం, 7న (శుక్రవారం) తెల్లవారుజామున అగ్నిగుండాలు, 8న (శనివారం) తెల్లవారుజామున అశ్వవాహన సేవ, అదేరోజు రాత్రి ఏకాంత సేవలు, మహాపూర్ణాహుతి, 9న (ఆదివారం) గ్రామోత్సవం చెర్వుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గజవాహన సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. అల్లవరపు సుబ్రహ్మణ్యదీక్షితావధాని పర్యవేక్షణలో నీలకంఠ శివాచార్య, దేవస్థాన ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరస్వామి అర్చక పర్యవేక్షణలో ఉత్సవ విశేష పూజాధికాలను నిర్వహించనున్నారు. కాగా ఉత్సవాల్లో స్వామివారి కల్యాణోత్సవం, అగ్నిగుండాలకు భక్తులు పోటెత్తనున్నారు. అగ్నిగుండాల రోజున శివసత్తులు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
చెర్వుగట్టులో పట్టు వస్ర్తాలు సమర్పించేదెవరు!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు పట్టువస్ర్తాలు సమర్పించే విషయంలో జిల్లా అధికార యంత్రాంగం సందిగ్ధంలో పడింది. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ తెల్లవారుజామున పార్వతీ జడలరామలింగేశ్వరుల కల్యాణం జరగనుంది. అయితే ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను జిల్లాకు చెందిన మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రతినిధులుగా హాజరై సమర్పించడం ఆనవాయితీ. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించే విషయంలో సందిగ్ధత నెలకొంది. అయితే కోడ్ అమలుకు ముందే ఉత్సవ ప్రక్రియ ప్రారంభమైనందున ఆనవాయితీని గౌరవిస్తూ ప్రభుత్వ పెద్దల చేత పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాతపూర్వకంగా కోరనున్నట్లు సమాచారం. ఈసీ అనుమతిస్తే ఆనవాయితీ కొనసాగనుంది. లేకుంటే నల్లగొండ జిల్లా కలెక్టర్ త్రిపాఠి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పిస్తారని అధికారులు చెబుతున్నారు. అయితే స్వామివారికి ఎమ్మెల్యే ఇతర ప్రజాప్రతినిధులు పట్టువసా్త్రలు సమర్పించాలనుకుంటే స్వయంగా వసా్త్రలను తీసుకువచ్చి ప్రొటోకాల్‌తో నిమిత్తం లేకుండా సమర్పించాల్సి ఉంటుంది.