కన్నీరు మిగిల్చిన మిరప సాగు
ABN , Publish Date - Feb 19 , 2025 | 12:19 AM
ఎర్ర బంగారంగా పిలిచే మిరప సాగు రైతులకు కన్నీరు పెట్టిస్తోంది.. వాతావరణ మార్పులు, వరుస తెగుళ్లతో దిగుబడులు పడిపోగా, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో మిరపకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుపోయారు. మిరప సాగులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలో 8.72లక్షలు, రాష్ట్రంలో 3.63లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. రాష్ట్రంలో 6.54లక్షల టన్నుల మిరప ఉత్పత్తి అవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.
వెంటాడిన తెగుళ్లు
క్వింటాకు రూ.14వేల వరకు ధర
ఎకరానికి రూ.3లక్షలకు పైగా పెట్టుబడులు
నష్టాలబారిన రైతులు
మిర్యాలగూడ(వ్యవసాయం), ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎర్ర బంగారంగా పిలిచే మిరప సాగు రైతులకు కన్నీరు పెట్టిస్తోంది.. వాతావరణ మార్పులు, వరుస తెగుళ్లతో దిగుబడులు పడిపోగా, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో మిరపకు ధర లేకపోవడంతో రైతులు నష్టాల్లో కూరుపోయారు. మిరప సాగులో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. దేశంలో 8.72లక్షలు, రాష్ట్రంలో 3.63లక్షల ఎకరాల్లో మిరప సాగవుతోంది. రాష్ట్రంలో 6.54లక్షల టన్నుల మిరప ఉత్పత్తి అవుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 30వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.
సాగు భారం
జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో రైతులు ప్రధానంగా మిరప పంటను సాగు చేశారు. మూడేళ్లుగా పంటలో నల్ల నల్లి వ్యాపించి ఆకు ముడత, దోమ, ఎర్ర నల్లి, జెమిని తెగులుతో పంట దెబ్బతింటోందిది. మొక్క నాటు వేసిన దగ్గర నుంచి ప్రతి కూల వాతావరణ ప్రభావంతో ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక దిగుబడులు పడిపోయాయి. ఎరువులు, పురుగు మందులు కూలీల ధరలు 50శాతం పెరగడంతో పెట్టుబడుల భారం అధికమైంది.
పెరిగిన పెట్టుబడులు
మెట్ట భూమి ఎకరా దున్నకానికి రైతుకు రూ.5వేల వరకు ఖర్చు వస్తోంది. మిర్చి విత్తనాలకు రూ.10వేలు వ్యయం అవుతోంది. పంటలో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి మొక్కలకు నీరందించేందుకు రూ.10వేల వరకు పెట్టుబడి అవుతోంది. ఇక అడుగు పిండి (25బస్తాలు) వినియోగించాల్సి రావడంతో అందుకు సుమారు రూ.40వేలు ఖర్చవుతోంది. అంతర్ సేద్యం (6 సార్లు) రూ.6వేలు, కలుపు తీసివేత కూలి (5 సార్లు) రూ.4వేల వరకు రైతులకు వ్యయం అవుతోంది. మిర్చికి ఎక్కువగా పురుగు మందులు వాడాల్సి వస్తోంది. అందుకు మందులకు (9నెలల్లో 45-50సార్లు పిచికారీ) రూ.లక్షవరకు ఖర్చు వస్తోంది. ఇక పంట చేతికి వచ్చాక మిర్చి తీతకు ఒక్కో క్వింటాకు కూలీలకు రూ.6వేల చొప్పున ఎకరా భూమిలో వచ్చే 25క్వింటాళ్ల దిగుబడిరి రూ.1.50లక్షల వరకు చెల్లించాలి. మొత్తంగా ఎకరా మిర్చి సాగుకు రైతుకు మొత్తం రూ.3.25లక్షలు పెట్టుబడి అవుతోంది. ఎకరా సాగుకు దిగుబడి 25 క్వింటాళ్లు వస్తుండగా, ప్రస్తుత మార్కెట్ ధర రూ.12,800 నుంచి రూ.14,000 చొప్పున రూ.3.20లక్షల నుంచి రూ.3.50లక్షలు మిర్చి విక్రయిస్తే రైతుల చేతికి అందుతోంది. పెట్టుబడి రూ.3.25లక్షలు పోగా క్వింటాకు రూ.12వేల ధర లభిస్తే రైతుకు రూ.5వేలు నష్టం వాటిల్లుతుంది. క్వింటాకు రూ.14వేలు ధర పలికితే రైతకు కేవలం రూ.25వేలు మాత్రమే మిగులుబాటు ఉంటుంది. కౌలు రైతు అయితే ఎకరానికి రూ.10వేలు కౌలు అదనం. వీరికి మిగిలేది శూన్యం.
దిగుబడులు, ధర లేక
మిరపకు ఈ ఏడాది తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. వరుస తెగుళ్లతో వారానికోసారి మందులు పిచికారీ చేయాల్సి రావడంతో రైతులు ఆర్థిభారం మోశారు. 10 నెలల పంట కాలంలో పెట్టుబడులు పెరగడంతో చాలా వరకు 9నెలల ముందేను రైతులు పంటను వదిలేస్తున్నారు. గత ఏడాది 40క్వింటాళ్ల దిగుబడులు రాగా, ఈ ఏడాది ఎకరానికి 20-25 క్వింటాళ్లకు మించి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా క్వింటాకు రూ.18-21వేల వరకు ధర పలికింది. ఈ ఏడాది మిర్చి సాగు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడంతో ప్రస్తుతం క్వింటాకు రూ.12వేల నుంచి రూ.14వేల ధరతో భారీగా నష్టాలు వచ్చినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిర్చి సాగుతో నష్టాలే : కూన్‌రెడ్డి సత్యనారాయణరెడ్డి, పెద్దగూడెం, అనుముల మండలం
ఈ ఏడాది 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట వేశాను. పంట వేసిన దగ్గర నుంచి తెగుళ్లు వ్యాప్తి అధికమయింది, పెట్టుబడులు, కూలీల ఖర్చు పెరిగింది. దిగుబడులు బాగా తగ్గిపోయాయి. మార్కెట్‌లో ధర లేక పోవడంతో పంట గిట్టుబాటు కాలేదు.. చేసిన కష్టం చేతికి రాలేదు.