Share News

చికెన్‌ విక్రయాలు తగ్గాయ్‌

ABN , Publish Date - Feb 13 , 2025 | 12:43 AM

కోళ్ల వైరస్‌ భయంతో చికెన్‌ వినియోగం తగ్గింది. రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాలో కోళ్లకు ఎలాంటి వైరస్‌, వ్యాధి సోకలేదని అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నా, విక్రయాల్లో తగ్గుద ల నమోదైంది.

చికెన్‌ విక్రయాలు తగ్గాయ్‌

సగటున 20శాతానికిపైగా తగ్గుదల

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైరస్‌ భయంలేదంటున్న పశుసంవర్థకశాఖ

ప్రతీ కోళ్లఫామ్‌ను తనిఖీ చేస్తున్న అధికారులు

నేటి నుంచి రూ.5వరకు పెరగనున్న చికెన్‌ ధర

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): కోళ్ల వైరస్‌ భయంతో చికెన్‌ వినియోగం తగ్గింది. రాష్ట్రంలో ప్రత్యేకించి ఉమ్మడి జిల్లాలో కోళ్లకు ఎలాంటి వైరస్‌, వ్యాధి సోకలేదని అధికారులు స్పష్టంగా పేర్కొంటున్నా, విక్రయాల్లో తగ్గుద ల నమోదైంది. ఏపీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో సూర్యాపేట జిల్లాలో చికెన్‌ విక్రయాలపై కొంత ప్రభావం ఎక్కువగా ఉండగా, నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో సగటు కంటే 20శాతం వరకు విక్రయాలు తగ్గాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోళ్లఫాంలను పశుసంవర్థకశాఖ అధికారులు తనిఖీ చేసి ఎక్కడా వైరస్‌ లక్షణాలు లేవని నిర్ధారించారు.

ఓ వైపు చికెన్‌ విక్రయాలు మందగిస్తే గురువారం నుంచి చికెన్‌ ధర కిలోకు రూ.3 నుంచి రూ.5 వరకు పెంచేందుకు పౌలీ్ట్ర సమాఖ్య నిర్ణయించింది. కోడిగుడ్ల ధరలు, విక్రయాలపై మాత్రం ఎలాంటి ప్రభావం కనిపించలేదు. విక్రయాలు, ధరలు యథావిధిగానే ఉన్నాయి. మార్కెట్లో పరిస్థితి ఇలా ఉంటే పశుసంవర్థకశాఖ అధికారులు మాత్రం ఉమ్మడి జిల్లాలో ఎలాంటి ఇబ్బందిలేదని, చికెన్‌, కోడిగుడ్లను ఆహారంలో తీసుకోవచ్చని, భయపడాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

నేటి నుంచి పెరగనున్న ధరలు

ఓవైపు ఏపీలో బర్డ్‌ఫ్లూతో చికెన్‌ ధరలు తగ్గుతాయనుకుంటే ఫామ్‌గేటు ధరలు మాత్రం గురువారం నుంచి పెరుగుతున్నాయి. ఈ మేరకు పౌలీ్ట్రదుకాణాల నిర్వాహకులకు ఇప్పటికే సమాచారం అందింది. ప్రస్తుతం ఫామ్‌గేట్‌ ధర లైవ్‌బర్డ్స్‌కి కిలో రూ.97 ఉంటే గురువారం నుంచి రూ.100కు పెరగనుంది. అదేవిధంగా చికెన్‌ధర సైతం కిలోకి రూ.4 పెంచినట్టు చికెన్‌ దుకాణదారులు తెలిపారు. ప్రస్తుతం చికెన్‌ధర లైవ్‌బర్డ్స్‌ కిలో రూ.97 ఉంటే, గురువారం నుంచి రూ.100కు, చికెన్‌ కిలో రూ.173 నుం చి రూ.177కు, స్కిన్‌లె్‌స ధరలు కిలో రూ.196 నుంచి రూ.201కి పెరుగుతాయని చెబుతున్నారు. కోడిగుడ్లు డజన్‌ రూ.60గానే కొనసాగుతోంది.

వైరస్‌ భయంతో తగ్గిన విక్రయాలు

ఏపీ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కారణంగా కోళ్లు చనిపోతున్నాయనే కారణంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చికెన్‌ విక్రయాలు తగ్గాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బుధవారం చికెన్‌, కోడిగుడ్ల కొనుగోళ్ల పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. నల్లగొండలో ఒక చికెన్‌ దుకాణం నిర్వాహకుడు సాఽధారణ పరిస్థితుల్లో సగటున 100 నుంచి 130కిలోల వరకు చికెన్‌ విక్రయించగా, బుధవారం స్వల్పంగా తగ్గి 100 కిలోల లోపే విక్రయించినట్టు తెలిపాడు. ఏపీ సరిహద్దు ప్రాంతాలైన సూర్యాపేట, కోదాడ పట్టణాల్లో మాత్రం సగటు అమ్మకాల కంటే 25 నుంచి 30శాతం మేర విక్రయాలు తగ్గాయి. సూర్యాపేట పట్టణంలో సుమారు 150 వరకు చికెన్‌ దుకాణాలుంటే, అందులో బుధవారం 40 దుకాణాల వరకు స్వచ్ఛందంగా మూసివేశారు. నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో మాత్రం ఈవ్యాధి ప్రభావంతో కొనుగోళ్లు 20శాతం మేర మందగించినా దుకాణాలన్నీ యథావిధిగానే కొనసాగాయి. దేవరకొండ పట్టణంలో కూడా చికెన్‌ అమ్మకాలు మందగించాయి. పట్టణానికి చెందిన ఓ చికెన్‌ దుకాణం నిర్వాహకుడు సాధారణ రోజుల్లో 150 కిలోల చికెన్‌ విక్రయించగా, బుధవారం 80కిలోలకు మించి విక్రయించలేదని తెలిపాడు. కోడిగుడ్ల విక్రయాల్లో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదని, సాఽధారణ రోజుల్లాగే విక్రయాలు సాగాయని దుకాణాల నిర్వాహకుడు తెలిపాడు.

వ్యాధి ప్రభావం లేదంటున్న పశుసంవర్థకశాఖ అధికారులు

ఏపీలోని కృష్ణా, గోదావరి జిల్లాల్లో కోళ్లఫాముల్లో ప్రబలిన వ్యాధి రాష్ట్రంలో ఎక్కడా నమోదవలేదని పశుసంవర్థకశాఖ అఽధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ నుంచి రాష్ట్రంలోనికి కోళ్లు రాకుండా పూర్తికట్టుదిట్టం చేశారు. రాష్ట్రం నుంచే ఏపీకి కోళ్లు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాలతో రాష్ట్రంలోని పౌలీ్ట్ర రైతులు, హ్యాచరీస్‌ నిర్వాహకులతో పశుసంవర్థకశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించడమేగాక, అన్ని జిల్లాల్లో కోళ్లఫారాలను పశుసంవర్థకశాఖ అధికారులు తనిఖీలు చేశారు. కోళ్లకు రక్త పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుత వాతావరణం అతి చలి నుంచి వేడిగా మారుతున్న సందర్భంలో కోళ్లకు ఒత్తిడి ఏర్పడి కొంతమేర నష్టం వాటిల్లుతోందని, రాష్ట్రంలో అంతకుమించి ఎలాంటి ఇబ్బంది లేదని పశుసంవర్థక శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 5,400 కోళ్లఫామ్‌లకు ఇప్పటికే 3,500 ఫామ్‌లలో తనిఖీలు పూర్తిచేయగా, ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదవలేదని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సైతం కోళ్లఫాముల్లో ఎక్కడా వ్యాధికారక లక్షణాలు కన్పించలేదని, కోళ్ల మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. కోళ్లకు వైరస్‌, లేక వ్యాధి సోకితే కేవలం ఐదురోజుల్లో ఫామ్‌లోని కోళ్లన్నీ చనిపోతాయని, రైతులెవరూ వ్యాధి, వైరస్‌ లక్షణాలు కనిపిస్తే దాచకుండా కఠినమైన ఆదేశాలిచ్చామని, పశుసంవర్థకశాఖ అధికారులు, వైద్యులు వారి పరిధిలోని అన్ని కోళ్లఫామ్‌లను నిత్యం తనిఖీచేస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక్క కోడికి వ్యాధి సోకినా ఆ ఫామ్‌ కిలోమీటర్‌ పరిధి వరకు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి ఆ పరిధిలోని కోళ్లన్నింటినీ నిర్మూలిస్తారని, మరో పదికిలోమీటర్ల పరిధి వరకు స్ర్కీనింగ్‌ నిర్వహించి కట్టుదిట్ట చర్యలు చేపడతామని ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా ఆ పరిస్థితి రాలేదని పేర్కొంటున్నారు.

సరిహద్దులో కోళ్ళ రవాణా వాహనాల తనిఖీ

(ఆంధ్రజ్యోతి, కోదాడ రూరల్‌, నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ రూరల్‌): ఏపీ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ నేపథ్యం లో బుధవారం కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు చెక్‌పోస్టు వద్ద ఏపీ నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీ చేసి తిప్పి పంపించారు. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వ్యాప్తికి వాహనాలు కూడా కారణం అవుతాయని, వాటిని శానిటైజ్‌ చేయాలని ఏవైనా కోళ్లు మృతిచెందితే గుంత తీసి, సున్నం పోసి పూడ్చాలని, కాల్వలో, ఆరుబయట ప్రాంతా ల్లో పడేయకూడదని సూర్యాపేట జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నాగార్జునసాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన వద్ద పోలీస్‌, అటవీశాఖ, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. ఇక్కడ అధికారులు మూడు షిప్టులుగా 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ వెటర్నరీ డాక్టర్‌ కేశవ్‌ అజ్మీరా, అటవీశాఖ అధికారి రవీందర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం, సుబ్బారెడ్డిగూడెం, రాయినిపాలెం గ్రామాల్లోని కోళ్ల ఫామ్‌లను పశుసంవర్ధశాఖ అధికారి దుర్గారమాదేవి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

చికెన్‌ను నిరభ్యంతరంగా తినవచ్చు

జిల్లాలో కోళ్లకు ఎలాంటి వ్యాధి, వైరస్‌ నమోదవలేదు. ఏ ఒక్క ఫామ్‌లో ఒక్క కోడి కూడా ఈ వైరస్‌ ప్రభావంతో చనిపోలేదు. మేం జిల్లాలో అన్ని ఫామ్‌లను తనిఖీ చేసి పరీక్షలు నిర్వహించాం. కోళ్లన్నీ ఆరోగ్యకరంగానే ఉన్నాయి. ఏపీ నుంచి మన జిల్లాకు కోళ్లు రాకుండా సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. సాఽధారణంగా మన జిల్లాకు కోళ్లు వచ్చే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ వైరస్‌, వ్యాధి లక్షణాలేవీ కనిపించలేదు. వీటన్నింటినీ పరిశీలించిన పిదప జిల్లాలో చికెన్‌, కోడిగుడ్లను ఆహారంగా అభ్యంతరం లేకుండా తీసుకోవచ్చు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు. కోళ్లఫామ్‌లపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నాం.

ఎండీ.ఖాద్రి, పశుసంవర్థకశాఖ జేడీ, నల్లగొండ జిల్లా

Updated Date - Feb 13 , 2025 | 12:43 AM