సంక్రాంతికి బస్సులే బస్సులు
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:51 AM
సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
రీజియన్‌లో 400 అదనపు బస్సులు నడపనున్న ఆర్టీసీ
నేటి నుంచి 13 వరకు, తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు
ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోల నుంచి బస్సులు
(ఆంధ్రజ్యోతి, నల్లగొండ) : సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసుల్లో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
పండుగకు పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చే ప్రయాణికులు అధికంగా ఉంటారు. వారిని దృష్టిలో పెట్టుకొని పం డుగ ముందు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు వచ్చే బస్సుల సంఖ్యను పెంచారు. ఉమ్మడి జిల్లాలో ఏడు డిపో ల నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దిల్‌సుఖ్‌నగర్, ఎల్.బీనగర్, ఉప్పల్, ఐఎ్‌ససదన్, సాగర్ రింగురోడ్డు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ క్యాంపులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి బస్సుల ను ఆపరేట్ చేయనున్నారు. రీజనల్ మేనేజర్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది వీటిని పర్యవేక్షించనున్నారు. ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు, ఆ తరువాత తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 400 ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజధాని, సరిహద్దు జిల్లాలకు ఈ బస్సులు నడవనున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సుల సంఖ్యను ఆర్టీసీ అధికారులు పెంచారు. దసరా పండుగ సందర్భంలో మాత్రమే ప్రత్యేక బస్సులు నడిపే ఆర్టీసీ ఈసారి సంక్రాంతి పండుగకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల కు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక బస్సులను పెద్ద సంఖ్యలో నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రయాణికులకు సౌకర్యంతోపాటు ఆర్టీసీకి అధిక లాభా లు సమకూర్చేందుకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నాయి. రాష్ట్ర రాజధానితో పాటు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలు, మండలాలు, గ్రామాలకు పండుగ సందర్భంగా ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశా రు. మరోవైపు విద్యా సంస్థలకు సెలవులు వస్తున్న నేపథ్యంతో పాటు పల్లెవెలుగులు, ఎక్స్‌ప్రె్‌సలలో మహిళలకు ఉచిత ప్రయాణం దృష్ట్యా రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. ఆయా డిపో ల పరిధిలో ఎన్ని బస్సులు నడిపించాలనే దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. ప్రత్యేక బస్సుల్లో ఎక్స్‌ప్రె్‌సలతో పాటు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులు ఉండనున్నాయి. పండుగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సుల ద్వారా స్వల్పంగా అదనపు చార్జీలు వసూలు చేసే యోచనలో సంస్థ ఉన్నట్లు సమాచారం.
రీజియన్ పరిధిలో ఏడు డిపోల నుంచి
నల్లగొండ రీజియన్ పరిధిలో దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, నార్కట్‌పల్లి, యాదగిరిగుట్ట నల్లగొండ మొత్తం ఏడు డిపోల నుంచి 400 బస్సు సర్వీసులు నడపనున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీని మేరకు వీటిని నడుపుతారు. ఈ నెల 9న 38 బస్సులు, 10న 110 బస్సులు, 11న 130 బస్సులు, 12న 90 బస్సులు, 13న 32 బస్సులు ప్రత్యేక సర్వీసుగా నడపనున్నారు. తిరిగి 15 నుంచి 20వ తేదీ వరకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతారు. హైదరాబాద్ నుంచి నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్టలకు అదనపు బస్సులు నడిపే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం రీజియన్‌లో 640 బస్సులు ఉన్నాయి. స్పేర్ బస్సులు కూడా మరో 40 ఉన్నాయి. ప్రతిరోజు 2.50లక్షల కి.మీలు తిరిగి ఆయా ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. రోజువారీగా సంస్థకు రూ.1.40కోట్ల మేర ఆదాయం వస్తోంది.
ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి: కె.జానిరెడ్డి, ఆర్టీసీ ఆర్‌ఎం
సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపనున్నాం. పండుగ రద్దీకి అనుగుణంగా ఆయా రూట్లలో వీటిని నడిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఎక్కడా ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా క్షేమంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశాం. ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా గమ్యాలకు చేరుకోవాలి. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక బస్సు సర్వీసుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.