ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:25 AM
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనుండగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ నోడల్ అధికారి సి.రమణి తెలిపారు.

ఇష్టంతో పరీక్షలు రాయాలి
ఇంటర్ నోడల్ అధికారి రమణి
- (ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 22 వరకు పరీక్షలు జరగనుండగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ నోడల్ అధికారి సి.రమణి తెలిపారు. ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఆమెతో ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూ విశేషాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు?
రమణి: ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభం కానుండగా, 22న ముగుస్తాయి. మొత్తం 29 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొదటి సంవత్సరం 6,208 మంది, ద్వితీయ సంవత్సరం 6,350 మంది, మొత్తంగా 12,558 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఆంధ్రజ్యోతి: పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి వసతులు కల్పించారు?
రమణి: విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లుచేశాం. ప్రతీ గదిలో ఫ్యాన్, పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాం. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, ట్రాన్స్‌కో, వైద్య ఆరోగ్య తదితర ప్రభుత్వశాఖలను సమన్వయం చేస్తూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.
ఆంధ్రజ్యోతి: అవకతవకల నివారణకు తీసుకుంటున్న చర్యలేంటి?
రమణి: అవకతవకల ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, రూట్ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల 200 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ అమలులో ఉంటుంది. ఇన్విజిలెటర్లు సహా విద్యార్థులు సెల్‌ఫోన్లు తదితర ఎలకా్ట్రనిక్ పరికరాలను తీసుకురావద్దు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్, సీఈ, డీవోలపై కూడా శాఖాపర చర్యలు తీసుకుంటాం.
ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు మీరిచ్చే సూచనలు?
రమణి: విద్యార్థులు ప్రశాంతంగా సమాధానాలు రాయాలి. ప్రశ్న పత్రాల లీకేజీ వదంతులను నమ్మవద్దు. పరీక్షలు ముగిసేవరకు తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ఒత్తిడికి గురైతే టోల్‌ఫ్రీ నెంబర్ 14416కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. పరీక్షా కేంద్రాలను ముందుగానే తెలుసుకోవాలి. హాల్‌టికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్‌తో పరీక్షా కేంద్రాల చిరునామాను సులువుగా తెలుసుకోవచ్చు. పెండింగ్ ఫీజుల పేరుతో హాల్‌టికెట్ ఇవ్వని ప్రైవేట్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.