అరకొర వసతుల మధ్యచదువులు
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:21 AM
గురుకుల పాఠశాల అంటేనే తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందులో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, నాణ్యమైన విద్య అందుతుందని వారు భావిస్తుంటారు.

జనంపల్లి బాలికల విద్యాలయంలో అన్ని అసౌకర్యాలే
తరగతి గదుల్లోనే నిద్ర
సరిపడాలేని మరుగుదొడ్లు, స్నానపు గదులు
బెడ్స్ లేక నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితులు
రామన్నపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : గురుకుల పాఠశాల అంటేనే తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందులో విద్యార్థులకు అన్ని రకాల వసతులు, నాణ్యమైన విద్య అందుతుందని వారు భావిస్తుంటారు. అందుకు భిన్నంగా గురుకులంలోనూ విద్యార్థులకు అరకొర వసతులే అందితే విద్యార్థు లు ఇబ్బందులు పడుతుండడంతో పాటు ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకింత ఆందోళన. రామన్నపేట మండలంలోని జనంపల్లి గురుకుల బాలికల విద్యాలంలో సమస్యలపై కథనం..రామన్నపేట మండలంలోని జనపంల్లి బాలికల గురుకుల పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 23 సంవత్సరాల క్రితం 10ఎకరాల విస్తీర్ణంలో కోటి రూపాయల వ్యయంతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. 385 మంది విద్యార్థులకు వసతులు కల్పించేలా భవనాన్ని నిర్మించారు. ఇందులో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు డార్మెంటరీ, తరగతి గదులు, మరుగుదొడ్ల వసతి కల్పించారు. 2017లో ప్రభుత్వం నూతనంగా పాఠశాలను జూనియర్ కళాశాలగా 680 మంది విద్యార్థుల సంఖ్యకు అప్‌గ్రేడ్ చేశారు. కానీ ప్రస్తుతం 585 మంది విద్యను అభ్యసిస్తున్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, డార్మెంటరీ, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించలేదు. దీంతో విద్యార్థులు మరుగుదొడ్లు, స్నానపు గదులు సరిపడా లేక ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. పడుకోవడానికి బెడ్స్ లేక తరగతి గదుల్లోనే నేలపై నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది.
రెగ్యులర్ ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు..
పాఠశాల, కళాశాలలో మొత్తం 21 మంది ఉపాధ్యాయులకు కేవలం 10మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు, 11మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఇంటర్మీడియట్ 8 మంది గెస్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. పాఠశాల, కళాశాలలో మొత్తం 16 తరగతి గదులకు గానూ 10 గదులు మాత్రమే ఉన్నాయి. ఇంటర్ తరగతులు కూడా పాఠశాల గదుల్లోనే కొనసాగుతున్నాయి.
తాగునీటి సమస్య
పాఠశాలలో నీటి సౌకర్యం కొరకు 19 గొట్టపుబావులు వేయగా నీళ్లు లేక 18 ఎండిపోయాయి. ఒక్క బోరుబావి నీళ్లతో పాటు, మిషనభగీరథ నీటితోనే విద్యార్థులు తమ సౌకర్యాలు సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో స్నానాలకు, మరుగుదొడ్లకు వెళ్లాలంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో తరగతి గదులకు మరుగుదొడ్లు దూరంగా నిర్మించడంతో రాత్రివేళలో విద్యార్థులు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. కోతుల బెడద వల్ల విద్యార్థులకు అనేక సార్లు గాయాలపాలవుతున్నారు. నీటి సమస్య తీర్చడానికి ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించాలని పలుమార్లు గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కరించలేదన్నారు. ఇటీవల ప్రిన్సిపాల్ రాజా గురుకులంలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి సమావేవాలు ఎందుకు పెట్టడం లేదని, గురుకులంలో విద్యార్థులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించగా ప్రిన్సిపాల్ సరైన సమాధానం చెప్పకపోవడంతో నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన కలెక్టర్ పాఠశాలను సందర్శించి నేరుగా విద్యార్థులతో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఉచిత వైద్య శిబిరం, పారిశుధ్యం, కోతుల బెడద నివారణకు సోలార్ సిస్టం, నీటి సౌకర్యం, డార్మెటరీ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
పైఅధికారులకు నివేదిక పంపినా పట్టించుకోవడం లేదు
నాపై కొంత మంది కావాలనే వ్యక్తిగత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వీరు చేసిన ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు. విద్యార్థులు నీటి తదితర సమస్యలు తీర్చడానికి పైఅధికారులకు నివేదికలు పంపినా పట్టించుకోవడం లేదు.
-రాజా, ప్రిన్సిపాల్
గురుకులంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి
పిల్లల ఆరోగ్య సమస్యలను ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదు. అస్వస్తతకు పాఠశాలకు వచ్చి పిల్లలను తీసుకోవాల్సి వస్తోంది. చర్మ వ్యాధులు వస్తున్నా తల్లిదండ్రులకు చెప్పడం లేదు. శానిటేషన అస్థవ్యస్తంగా ఉంది.
-జమాండ్ల ప్రశాంతి