Share News

పంటల బీమా ఏదీ?

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి రాలేక పోతోంది. కాంగ్రెస్‌ అఽధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు పంటల బీమాపై విధివిధానాలను ఖరారు చేయలేదు. గత వానాకాలం సీజన్‌ నుంచే పంటల బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించినా, యాసంగి సీజన్‌ ప్రారంభమైనా ఇది అమలుకు నోచుకోలేదు.

పంటల బీమా ఏదీ?

ఇంకా విధివిధానాలు రూపొందించని ప్రభుత్వం

బీమా కంపెనీలతో చర్చలతోనే సరి

పంటలు దెబ్బతింటే పరిహారం దక్కని పరిస్థితులు

ఉమ్మడి జిల్లాలో 21.50లక్షల ఎకరాల్లో పంటల సాగు

నల్లగొండ, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి రాలేక పోతోంది. కాంగ్రెస్‌ అఽధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటి వరకు పంటల బీమాపై విధివిధానాలను ఖరారు చేయలేదు. గత వానాకాలం సీజన్‌ నుంచే పంటల బీమా పథకం అమలు చేస్తామని ప్రకటించినా, యాసంగి సీజన్‌ ప్రారంభమైనా ఇది అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖ అధికారులకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఈ సీజన్‌లో పథకం అమలు లేనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పీఎంఎ్‌ఫబీవైలో చేరడంతో పాటు పంటల బీమా కోసం రైతుల వాటా ప్రీమియం కూడా చెల్లిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. అయితే ఏడాదిగా ఈ పథకం అమలుకు విధివిధానాలు రూపొందించాలని ఆర్థిక గ్రామం యూనిట్‌గా వరి పంటకు పంటల బీమా పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అంటే 250ఎకరాలు ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఒక చిన్న గ్రామం లేదంటే తండాలో 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు వరి ఉంటే పక్క గ్రామంలో వరి సేద్యాన్ని కలిపి 250 ఎకరాలను ఒక యూనిట్‌గా చేస్తారు. పత్తిని మాత్రం మండల యూనిట్‌గా తీసుకోనున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ప్రధాని ఫసల్‌ బీమా యోజనతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న పంటల బీమా అందుబాటులోకి తీసుకురావాలని కొంత మేర కసరత్తు చేసినా ఆ తరువాత దీన్ని పక్కనపెట్టింది. వాస్తవానికి గత వానాకాలంలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. టెండర్లను ఏకమొత్తంగా కాకుండా క్లస్టర్ల వారీగా పిలవాలని వ్యవసాయశాఖ నిర్ణయించినట్టు సమాచారం. పీఎంఎ్‌ఫబీవై మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకరానున్న నేపథ్యంలో ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తయితేనే నిధులపై స్పష్టత వస్తుంది. రాష్ట్రం వాటా చెల్లించిన తరువాతే కేంద్రం వాటా జమ చేస్తుంది. ఇక పంటల గుర్తింపు, దిగుబడి లెక్కింపునకు సాంకేతికతను వినియోగించుకోనుండగా అందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకరానున్నారు. అదే సమయంలో సాంకేతికతతో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా పంటలను గుర్తించనున్నారు. పంటల బీమా అమలులోకి వస్తే పంట నష్టపోయిన రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆ వైపుగా చర్యలు కానరావడం లేదు.

బీమా కంపెనీలతో చర్చలతోనే సరి

ఉచిత పంటల బీమా పథకం అమలు కోసం బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణ కోసం రాష్ట్ర స్థాయిలో అధికారులు చర్చలతోనే సరిపెట్టారు. వ్యవసాయశాఖ ద్వారా చేపట్టే క్రాఫ్‌ బుకింగ్‌ యాప్‌లో పంటల వివరాలు నమోదయితే నష్టం జరిగినప్పడు ఆ పంటలకు పరిహారం వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 21.50లక్షల ఎకరాలల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టు కింద నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో పెద్ద మొత్తంలో వరి సేద్యమవుతుంది. డిండి ప్రాజెక్టుతో పాటు ఏఎమార్పీ, మూసీ ప్రాజెక్టు, యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతం వెంట వరి సేద్యమే అధికంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మెట్ట ప్రాంతాలల్లో రైతులు అత్యధికంగా పత్తికే ప్రాధాన్యం ఇస్తారు. ఎంత సాగు అయితే అంతా మేర పంటల బీమా పథకం అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని మెరుగైన విధంగా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లా వారీగా చర్చలు జరిగినా, సదస్సులు మాత్రం నిర్వహించలేదు. ఏఈవోల నుంచి మొదలు ఏవోఏలు, ఏడీఏలు, డీఏవోలు, సీపీవోలు ఇతర అనుబంధశాఖల అధికారులతో సదస్సులు నిర్వహిస్తామని గతంలో ప్రకటించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

త్వరలో పంటల బీమా పథకం: పి.శ్రవణ్‌కుమార్‌, జేడీఏ నల్లగొండ

త్వరలోనే పంటల బీమా పథకం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు పంటల బీమా పథకంపై చర్చలు జరిపింది. అందుకు సంబంధించి కసరత్తు కూడా మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయశాఖకు మార్గదర్శకాలు వచ్చిన వెంటనే పథకం అమలు కోసం మార్గం సుగుమం కానుంది. పంటల బీమా పథకం అమలులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం త్వరితగతిన అందుతుంది.

Updated Date - Feb 03 , 2025 | 12:24 AM