బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం
ABN , Publish Date - Feb 12 , 2025 | 01:06 AM
నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొద్ది రోజల క్రితం కోళ్లు మృత్యువాత పడగా, అందుకు బర్డ్‌ఫ్లూ కారణం కాదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖతో పాటు ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గుర్తింపు
కోళ్లు దిగుమతి కాకుండా రాష్ట్ర సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులు
నల్లగొండ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొద్ది రోజల క్రితం కోళ్లు మృత్యువాత పడగా, అందుకు బర్డ్‌ఫ్లూ కారణం కాదని రాష్ట్ర పశుసంవర్ధకశాఖతో పాటు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి, పలు జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్‌ఫ్లూతో ఏపీలో కోళ్లు మృతిచెందాయని తెలిసిన వెంటనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కోదాడ, వాడపల్లి, నాగార్జునసాగర్‌లో మూడు చెక్‌పోస్టులను అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి కోళ్లు సరఫరా చేసే వాహనాలను ఈ చెక్‌పోస్టుల వద్ద నిలిపి ఆ రాష్ట్రానికి తిప్పి పంపిస్తున్నారు. కోళ్లకు బర్డ్‌ఫ్లూ ముంచుకొస్తుండటంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధకశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు కోళ్ల ఫాములను ముమ్మరంగా తనిఖీచేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో కోళ్లు మృతిచెందినట్టు అధికారికంగా ప్రకటన లేదు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కోళ్ల ఫాములు ఉండగా నల్లగొండ ఆ తరువాత స్థానంలో ఉంది. సుమారు 80లక్షల కోళ్లు ఉమ్మడి జిల్లా పరిధిలో పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో మూడు నెలల పాటు కోడి మాంసంతో పాటు కోడి గుడ్లను తినకుండా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా బర్డ్‌ఫ్లూ లక్షణాలు కన్పిస్తే కోళ్ల దుకాణాలను మూసివేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
కోళ్లు మృతిచెందితే సమాచారం ఇవ్వాలి : కలెక్టర్
(ఆంధ్రజ్యోతి, భువనగిరి కలెక్టరేట్): ఏపీ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ సోకిందనే నేపథ్యంలో పశుసంవర్ధశాఖ అధికారులు, కోళ్ల ఫాముల యజమానులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. కోళ్లకు హైలీ పాథజెనిక్ ఏవిఎన్ ఇన్‌ఫ్లూఎంజా (హెచ్‌పీఏఐ) విస్తరిస్తున్న నేపథ్యంలో కోళ్లు చనిపోతే ఫాముల యజమానులు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. పౌలీ్ట్ర యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి సోకి పెద్ద మొత్తంలో కోళ్లు మృతి చెందితే వాటిని పాతిపెట్టి ఇతర కోళ్ల ఫాములకు వ్యాపించకుండా నివారించాల్సిన అవసరం ఉందన్నారు.