Share News

శోకసంద్రమైన కొండగడప

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:15 AM

: మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప వాసులు నలుగురికి శనివారం గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.

శోకసంద్రమైన కొండగడప
అంత్యక్రియల్లో పాల్గొన్న కృష్ణమూర్తి,

మహారాష్ట్ర రోడ్డు ప్రమాద మృతులకు అంత్యక్రియలు పూర్తి

మోత్కూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడప వాసులు నలుగురికి శనివారం గ్రామంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఊరంతా కన్నీటి పర్యంతమవుతూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్యామ్‌శెట్టి ప్రేమలత, తొలుపునూరి ప్రసన్నలక్ష్మీ, తొలుపునూరి అక్షిత, శ్యామ్‌శెట్టి వైద్విక్‌(ఆరు నెలలు) మృతదేహాలు శుక్రవారమే స్వగ్రామానికి వచ్చాయి. మిగతా కుటుంబసభ్యులు క్షతగాత్రులై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటంతో వారు వచ్చే వరకూ అంత్యక్రియలను నిలిపివేశారు. గాయపడి ఔరంగాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రేమలత భర్త కృష్ణమూర్తిని డాక్టర్ల అనుమతితో ప్రత్యేక జాగ్రత్తలతో శనివారం కొండగడప గ్రామానికి తీసుకవచ్చారు. కుటుంబ సభ్యులను విగతజీవులుగా చూసి కృష్ణమూర్తి కన్నీరుమున్నీరయ్యాడు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్యామ్‌శెట్టి వెంకన్న, తొలుపునూరి శ్రీనివాస్‌, శరణ్య తమ వారిని కడసారి చూసుకోలేకపోయారు.

తల్లికి కుమార్తె, కోడలకి మామ తలకొరివి

అంత్యక్రియల పరిస్థితుల అందరి హృదయాలను ద్రవించేలా చేశాయి. కృష్ణమూర్తి కుమారుడు వెంకన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడి భార్య ప్రేమలతకు వారి చిన్నకుమార్తె స్రవంతి, తొలుపునూరి శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో అతడి భార్య ప్రసన్నలక్ష్మీకి మామ(శ్రీనివాస్‌ తండ్రి) సత్యనారాయణ తలకొరివి పెట్టారు. అక్షిత వివాహం జరుగనందున ఆమెకు, చిన్నారి బాలునికి తలకొరివి పెట్టకుండా అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబానికి చెందిన ఒకేసారి నలుగురు మృతి చెందడం, వారికి అయిన వారు కడసారి చూపుకు రాలేని స్థితిలో ఉండటం ప్రజల హృదయాలను కలిచివేసింది. బంఽధువులు, స్నేహితులు వారికి కన్నీటి వీడ్కోలు పలికారు.

మృతదేహాలను చూసి ఆగిన వృద్ధుడి గుండె

మహారాష్ట్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్యామ్‌శెట్టి ప్రేమలత, ఆమె కూతురు ప్రసన్నలక్ష్మీ, మనుమరాలు అక్షిత, మనుమడు వైద్విక్‌ మృతదేహాలను శుక్రవారం వారి స్వగ్రామం కొండగడప తీసుకవచ్చిన విషయం తెలిసిందే. గ్రామస్థులు పెద్దసంఖ్యలో వెళ్లి అక్కడ హృదయవిదారక పరిస్థితిని చూసి కంటతడిపెట్టారు. అందిరిలానే గ్రామంలోని బుడిగెజంగాల కాలనీకి చెందిన కళ్లెం పెద్దరాములు(85) కృష్ణమూర్తి ఇంటికి వద్దకు వెళ్లి వరుసగా ఉంచిన మృతదేహాలను చూశాడు. అయ్యో ఒకేసారి నలుగురు మృతి చెందారా, కృష్ణమూర్తి కుటు ంబం చిన్నాభిన్నమైందే అని వాపోయాడు. ఇంటికి తిరిగి వెళుతూ కొద్దిదూరం వెళ్లగానే తనకు గుండెలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలిపోయాడు. అతడి కుటుంబసభ్యులు డాక్టర్‌ను పిలించి చూపించగా అప్పటికే మృతి చెందాడని చెప్పారు. పెద్దరాములుకు నలుగురు కుమారులు, ఎనిమిది మంది కుమార్తెలు ఉన్నారు. అందరి వివాహాలు జరిగి స్థిరపడ్డారు. రాములు అంత్యక్రియలు కూడా శనివారమే జరిగాయి. కొండగడప గ్రామంలో ఒకేరోజు ఐదుగురు వ్యక్తులకు అంత్య క్రియలు జరపడం గ్రామమంతా శోకసంద్రమైంది.

Updated Date - Jan 19 , 2025 | 12:15 AM