సర్వేకు పైసా వసూల్
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:56 AM
ఓ రైతుకు చెందిన ఎనిమిది గుంటల భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ రూ.15వేల లంచం డిమాండ్ చేయగా, కాళ్లావేళ్లా పడి బతిమాలితే రూ.12వేల లంచం తీసుకొని సర్వే చేసేందుకు అంగీకారించాడు.

భారీగా లంచాల డిమాండ్
ఎనిమిది గుంటల భూమికి రూ.12వేల లంచం
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
తాజా ఉదంతంతో వెలుగులో కి ముడుపుల ముచ్చట్లు
అడ్డగోలుగా హద్దుల నిర్ధారణతో సమస్యలు
క్షేత్రస్థాయిలో పలు వివాదాలకు కారణం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): ఓ రైతుకు చెందిన ఎనిమిది గుంటల భూమి సర్వే చేసేందుకు సర్వేయర్ రూ.15వేల లంచం డిమాండ్ చేయగా, కాళ్లావేళ్లా పడి బతిమాలితే రూ.12వేల లంచం తీసుకొని సర్వే చేసేందుకు అంగీకారించాడు. ఆ డబ్బు ముందే ఇవ్వాలని డిమాండ్‌తో విసిగిన సదరు భూయజమాని చివరికి అవినితీ నిరోధకశాఖను ఆశ్రయించి లంచం డబ్బులిస్తూ అతడిని పట్టించిన ఘటన శుక్రవారం చర్చనీయాంశమైంది. మర్రిగూడ మండల ఔట్‌సోర్స్ సర్వేయర్ ఎల్.రవి రూ.12వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా, జిల్లాలో ల్యాండ్ సర్వేయర్ల అడ్డగోలు ముడుపుల దందా మరోమారు చర్చనీయాంశమైంది.
జిల్లాలో ఎక్కడికి వెళ్లినా, భూముల సర్వే చేయాలంటే భారీగా ముడుపులిచ్చుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. ఉన్నతస్థాయి అధికారులు, కీలక ప్రజాప్రతినిధులు సూ చించినా, క్షేత్రస్థాయిలో మాత్రం లంచం ఇస్తే తప్ప భూ ములు, స్థలాల సర్వే చేయని పరిస్థితి ఉంది. సర్వేయర్ల కొరత పేరుతో ఔట్‌సోర్స్, కాంట్రాక్ట్ పద్ధతిలో సర్వేయర్లను సర్వేలకు పంపిస్తున్నారని, దీంతో వాళ్లు బాధ్యతారాహితంగా ఎవరికి ముడుపులిస్తేవారికి అనుకూలంగా సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తా జాగా, శుక్రవారం ఏసీబీకి చిక్కిన సర్వేయర్ సైతం అవుట్‌సోర్స్ ఉద్యోగే కావడం గమనార్హం. అప్లికేషన్ సీనియార్టీ, రికార్డులు, నక్షాల ప్రకారం సర్వేకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా ఉన్నది ఉన్నట్టు తేల్చాల్సిన సర్వేయర్లు ముడుపులిచ్చివారికి అనుకూలంగా రిపోర్టులిస్తున్న ఘటనలు జిల్లా లో పలుమార్లు వెలుగులోకి వచ్చాయి. ముడుపులిచ్చినవారికి అనుకూలంగా హద్దులు నిర్ణయించిన సందర్భాల్లో భూవివాదాలున్న వారిమధ్య ఘర్షణలు, కొట్లాటలతో పోలీ సు కేసుల వరకు వెళ్లిన సంఘటనలూ ఉన్నాయి.
అడ్డగోలుగా సరిహద్దుల నిర్ధారణ
సర్వేయర్లకు ముడుపులిస్తే అనుకూలంగా సరిహద్దులు పెట్టేస్తుండడంతో ఘర్షణలు, గొడవలు జరగడంతో పాటు పరస్పరదాడులు, కేసులు నమోదవుతున్నాయి. సర్వే ఎవరు చేయించినా, దరఖాస్తు ఎవరు పెట్టుకున్నా ఆ భూ మికి నాలుగు దిక్కుల హద్దుల్లో ఉన్నవారికి సైతం నోటీసులిచ్చి, వారి సమక్షంలోనే దరఖాస్తుదారుల భూమిని నిర్ధారించి హద్దులు నిర్ణయించాలి. టీఫన్లు, నక్షాలు, రెవెన్యూ రికార్డులతో పాటు సర్వేనెంబర్లు సరిపోల్చుకొని, పక్కాగా ఈ సర్వే చేయాలి. ఈ నిబంధనలేవీ క్షేత్రస్థాయిలో అమలు చేయ డం లేదని పలువురు వాపోతున్నారు. మిర్యాలగూడడివిజన్‌లో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ఓ గ్రామం లో భూయజమాని సర్వేకు దరఖాస్తు చేసుకోగా, అతడు సుమారు రూ.లక్షవరకు ముడుపులు తీసుకొని హద్దులు నిర్ధారించడంతో అది పెద్దవివాదంగా మారింది. ఒక్కోచోట పలు పర్యాయాలు దరఖాస్తు చేసుకున్నా సర్వే కురాని అధికారులు, ఉద్యోగులు ఇక్కడ మాత్రం సదరు భూయజమాని ఎన్నిసార్లు పిలిస్తే అన్ని పర్యాయాలు సర్వేకు వచ్చి దాయాది భూమి కొనుగోలుచేసిన వారిని ఆక్రమణకు పాల్పడ్డారంటూ నివేదికలు ఇస్తుండడంతో సిబ్బంది ముడుపుల బాగోతం వెలుగుచూసింది.
ముడుపులిస్తేనే సర్వేలు
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భూముల సర్వే చేయాలంటే ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని, సీనియార్టీ ప్రకారం సర్వేకు రావాలని కోరితే, సిబ్బంది లేరని, డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతంలో పనిచేస్తున్నామని తప్పించుకుంటున్నారు. నిబంధనల ప్రకారం సర్వేకు దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో పని పూర్తిచేయాల్సి ఉండగా, వందలాది దరఖాస్తులు ఏడాది గడిచినా సర్వేకు నోచుకోలేదు. ముడుపులిస్తే మాత్రం ప్రైవేట్ సిబ్బంది సహా భూముల వద్ద వాలి సర్వేచేసి హద్దులు నిర్ధారిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, సాకులతో తప్పించుకోవడమే తప్ప సర్వే మాత్రం చేయడం లేదని పలువురు బాధితులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. జిల్లాలో ఏడుగుంటల భూమికే రూ.12వేల లంచం తీసుకున్నారంటే లంచాల డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఆయకట్టు ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో అయితే సర్వే చేస్తే ఎకరాకు రూ.20వేల వరకు డిమాండ్ చేస్తున్నారని, మిగిలిన చోట్లా ఎకరాకు రూ.10వేలకు మించి ఇవ్వకపోతే సర్వే వ్యవహారం ముందుకు సాగనీయడం లేదని వాపోతున్నారు. నాలుగు ఎకరాలకు మించి సర్వే చేయాలంటే కనీసం రూ.50వేలు చెల్లించకతప్పడం లేదని బాధితులు తెలిపారు.
నార్కట్‌పల్లి మండలం నెమ్మానికి చెందిన ఓ పట్టాదా రు ముడుపులివ్వకుండా తన భూమిని సర్వేచేయాలని అధికారుల చుట్టూ తిరిగితే పనికాలేదని, చివరికి మూడెకరాలకు రూ.50వేల లంచమిస్తే సర్వే చేశారని, మళ్లీ అందులోనూ తప్పులున్నాయని, సరిహద్దు సమస్య వస్తే చివరికి గ్రామంలో పెద్దమనుషుల సమక్షంలో సర్దుబాటు చేసుకొని రాజీపడాల్సి వచ్చిందని తెలిపాడు.
ఫ చండూరు మండలం కొండాపురంలో ఇద్దరు రైతుల మధ్య సరిహద్దు పంచాయయితీ నెలకొనడంతో ఓ రైతు తన భూమిని తేల్చాలంటూ సర్వేకు దరఖాస్తు చేసుకున్నాడు. సర్వే నిర్వహించిన మండల సర్వేయర్ కొలతలు నిర్వహించి, ఆ దరఖాస్తుదారుడికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చాడు. అయితే ఇది సరికాదని, తనకు అన్యాయం జరిగిందని ఇంకో రైతు జిల్లా సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకోగా, వారు నిర్వహించిన సర్వేలో ఈ రైతుకు అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. దీంతో ఇద్దరు సర్వేయర్లు రెండు రకాల రిపోర్టులివ్వడంతో రైతుల మధ్య వివాదం చెలరేగి గొడవపడ్డారు. పోలీ్‌సస్టేషన్‌లోనూ కేసులు పెట్టుకున్నారు. చివరికి పెద్దమనుషుల సమక్షంలో ప్రైవేట్ సర్వే చేయించుకున్నా, ఇరువర్గాలు ఆమోదించకపోవడంతో ప్రస్తుతం ఆ భూమిని సాగుచేయకుండా వదిలేశారు.
ఫ దామరచర్ల మండలం కేశవాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఓ భూయజమాని సర్వేకు దరఖాస్తు చేసుకోగా, గత ఏడాది సెప్టెంబరులోనే నోటీసులిచ్చినా, నేటికీ సర్వే చేయలేదు. సర్వేయర్లు బిజీగా ఉన్నారనే కారణం చెబుతున్నారని, ఏదోరకంగా సర్వే చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు భూయజమాని తెలిపాడు.
ఫ కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో రెండు కుటుంబాల మధ్య భూవివాదం ఉంది. ఇక్కడ ఇద్దరు సర్వేయర్లు వేర్వేరు రిపోర్టులివ్వడంతో రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత పెరిగింది. ఒక సర్వేయర్ పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని తప్పుడు రిపోర్టు ఇచ్చారని ఓ కుటుంబం ఆరోపిస్తూ, మరో సర్వే కోరితే, వారికి అనుకూలంగా ఇంకో సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చాడు. కానీ, ఆయన బదిలీపై వెళ్లడంతో రిపోర్ట్ ఇవ్వకపోవడంతో మళ్లీ ఈ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.
ఫ జిల్లా కేంద్ర సమీపంలోని ఓ మండలంలో ఏడాదికాలంగా దాదాపు 45 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కారణమేంటని ఆరాతీస్తే ముడుపులివ్వకపోవడం వల్లే సర్వేకు సర్వేయర్లు రావడం లేదని, పైగా వేరే ప్రాంతాల్లో డిప్యూటేషన్‌పై ఉన్నామని కొన్నాళ్లు వేచి ఉండాలని సూచిస్తున్నారని, అదే ముడుపులిచ్చినవారికి మాత్రం ఆదివారాలు సైతం వచ్చి సర్వే చేసి వెళ్తున్నారని భూయజమానులు వాపోతున్నారు.
ప్రైవేట్ వ్యక్తులను నియంత్రిస్తేనే
జిల్లాలో సర్వేయర్ల కొరత నెపంతో సర్వే విభాగం అధికారులు చేస్తున్న తప్పిదాలు రైతులకు శాపంగా మారాయి. పలు మండలాల్లో సర్వేకు దరఖాస్తులు ఇస్తే, సదరు సర్వేయర్ లేక ఇన్‌చార్జి సర్వేయర్ భూముల కొలత బాధ్యతను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ప్రైవేట్ సర్వేయర్లు, ప్రభుత్వ సర్వేయర్ కలిసి ఎవరికి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలనుకుంటే, అందుకనుగుణంగా కొలతలు వేసి, హద్దులను ప్రైవేట్ సర్వేయర్లు నిర్ధారిస్తున్నారని దీంతో వివాదాలకు చెలరేగుతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. ప్రధానంగా భూముల విలువలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. ల్యాండ్ సర్వే విభాగంలో ప్రైవేట్ వ్యక్తుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.