ప్రలోభాల పర్వం ముగిసిన ప్రచారం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:59 AM
ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగ ల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగియగానే ఓట్లకోసం ప్రలోభాలు మొదలయ్యాయి. మేధావి వర్గానికి సైతం ప్రలోభాల ఎరవేయడంపై విమర్శలు వస్తున్నప్పటికీ అడ్డదారులు ఆగడం లేదన్న చర్చ సాగుతోంది.
ఫోన్‌పేకు రూ.2వేలు పంపుతున్న వైనం
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా అధికారుల చర్యలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి-నల్లగొండ): ఉపాధ్యాయ సంఘాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న శాసనమండలి నల్లగొండ-ఖమ్మం-వరంగ ల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగియగానే ఓట్లకోసం ప్రలోభాలు మొదలయ్యాయి. మేధావి వర్గానికి సైతం ప్రలోభాల ఎరవేయడంపై విమర్శలు వస్తున్నప్పటికీ అడ్డదారులు ఆగడం లేదన్న చర్చ సాగుతోంది.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గంలో బలంగా పోటీపడుతోన్న కొందరు అభ్యర్థుల తరఫున వారికి మద్దతిస్తోన్న, వారి తరఫున పనిచేస్తున్న ప్రతినిధులు ఇప్పటి కే ఎక్కడికక్కడ విందులతో సందడి చేస్తుండగా, మంగళవారమే కొంద రు ప్రతినిధులు కవర్లలో ఓట్లకు డబ్బులందించారని, మరో అభ్యర్థి తరఫున ఫోన్‌పేలలో డబ్బు అందించార ని చెబుతున్నారు. ఇంకో అభ్యర్థి తరఫున పనిచేసే ప్రతినిధులు మొత్తం ఓటర్ల జాబితా, వారి ఫోన్‌నెంబర్లు, వారి కుటుంబీకుల ఫోను నెంబర్లు సేకరించారని, వీరందరికీ బుధవారం లేకపోతే గురువారం ఓటింగ్‌కు వెళ్లే సమయానికి నగదు పంపిణీ చేస్తారని చెబుతున్నారు. మంగళవారమే అభ్యర్థులకు సంబంధించి ఓట్లకు డబ్బుల పంపిణీ మొదలుపెట్టినట్లు సోషల్‌మీడియా గ్రూపులలో వైరల్ గా మారడం చర్చనీయాంశంగా మారింది. పరిమిత ఓటర్లు, మేధావి వర్గమైన ఉపాధ్యాయులకే ఓట్లకోసం డబ్బు ఎరవేయడం దారుణమని, ఈ ప్రలోభాలపై ఎన్నికల సంఘం దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పలువురు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
హైస్కూల్ ఓట్లే 90 శాతం వరకు..
బలమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కీలకమైన ఉపాధ్యాయ విభాగపు ఓట్ల కోసం ప్రధాన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఎన్నికల బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ, యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్‌టీయూ అభ్యర్థి గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి, పీఆర్‌టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తంరెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో బరిలో దిగిన మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్ తరఫున వారికి మద్దతిచ్చే సంఘాలు, పార్టీలు, ప్రతినిధులు ఓట్లకోసం చివరివరకు ప్రయత్నాలు చేశారు. మొత్తం 25,797 ఓట్లలో సగం ఓట్ల వరకు సంఘాల వారీగా, అభ్యర్థుల వారీగా స్థిరమైన ఓటుబ్యాంక్‌గా ఉంటాయని, వీటిలో దాదాపు హైస్కూల్ ఓట్లే 90 శాతం వరకు ఉంటాయని భావిస్తున్నారు. మిగిలిన దాదాపు 12వేల ఓట్లలో ఎక్కువభాగం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరు సాధిస్తే వారికి విజయావకాశాలు మెరుగ్గా ఉండనుండడంతో ఆ ఓట్లకోసం అభ్యర్థులంతా కృషి చేశారు. ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, గురుకులాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులతోపాటు రికగ్నైజ్డ్ స్కూళ్ల టీచర్ల ఓట్లు ఇందులో ఉన్నాయని, వీరిలో ఎక్కువ వాటా ఎవరు సాధిస్తే వారికి అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఓట్లన్నీ గంపగుత్తగా ఎవరికీ పడే అవకాశాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అభ్యర్థులు ఈ ఓట్లకోసం తీవ్రంగా శ్రమించి వీరి ఓట్లకోసమే ప్రత్యేకంగా ప్రచారం సైతం నిర్వహించారు. చివరికి వీరు ఎవరిని కరుణిస్తే వారే విజేతలయ్యే పరిస్థితి నెలకొనడంతో సంఘాల పరపతి, బీసీ వాదం, ప్రభుత్వంలో పరపతి, ఉపాధ్యాయులకోసం పోరాడే స్వభావాన్ని ఆయా ఓటర్లకు వివరిస్తున్న అభ్యర్థులు వారిని తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరి వాదనలు, సిద్ధాంతాలు, అభ్యర్థనలు వింటోన్న ఈ ఉపాధ్యాయులు చివరికి ఎటు మొగ్గు చూపుతారనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది.
ముగిసిన ప్రచారఘట్టం
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మంగళవారం సాయంత్రం వరకు ప్రచారం ముగిసింది. ప్రధాన అభ్యర్థులు, వారి తరఫున ప్రచారం చేస్తున్న సంఘాలు, రాజకీయ ప్రతినిధులు మంగళవారం సాయంత్రానికి ఎక్కడివారక్కడే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. చివరి నిమిషం వరకు ఆయా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి మొదటి ప్రాధాన్య ఓటేయాలని అభ్యర్థించారు. మోడల్ బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 25,797మంది ఓటర్లు నమోదయ్యారు. నల్లగొండ జిల్లాలో 4,683 ఓటర్లకు 37 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, సూర్యాపేట జిల్లాలో 2,664 మంది ఓటర్లకు గాను 23 పోలింగ్ స్టేషన్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 984 మంది ఓటర్లకు గాను 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి ఉమ్మడి జిల్లాలో సైలెన్స్ పీరియడ్‌ని అమల్లోకి తెచ్చారు. మద్యం దుకాణాలకు తాళాలువేశారు. ఈ పీరియడ్‌లో ప్రచారం, సోషల్‌మీడియాలో సైతం పోస్టులు పెట్టడం వంటి పనులు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు 600మంది సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ వెల్లడించారు. జిల్లాలో ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకూ బీఎన్‌ఎ్‌సఎ్‌స 163 అమల్లో ఉంటుందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు జిల్లా విడిచివెళ్లిపోవాలని సూచించారు.
ప్రలోభపెట్టాలని ప్రయత్నించడం దారుణం : టీఎస్‌యూటీఎఫ్
నల్లగొండ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురిచేయాలనే ప్రయత్నాలు చేయడం దారుణమని, ఈచర్యలను ఉపాధ్యాయులంతా అడ్డుకోవాలని టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావా రవి, ఏ.వెంకట్ అన్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రచారం ముగిసిన వెంటనే కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరదీసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక అభ్యర్థి పక్షాన గుర్తుతెలియని వ్యక్తులు రూ.2వేల ఫోన్‌పే చేస్తున్నారని తెలిపారు. కొందరు ఓటర్లు ఆ డబ్బుని తిరస్కరిస్తూ రిటర్న్ పేమెంట్ చేశారని వెల్లడించారు. మరో ప్రముఖ సంఘం పక్షాన భద్రాద్రి జిల్లాలో రూ.100, ఖమ్మం జిల్లాలో రూ.2వేలు, మహబూబాబాద్ జిల్లాలో రూ.5వేల చొప్పున పంపిణీ చేసినట్లు తమకు సమాచారమొచ్చిందన్నారు. నగదుని తిరస్కరించిన ఉపాధ్యాయులను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. డబ్బు పంపిణీని తమసంఘం తీవ్రంగా ఖండిస్తుందని, ఎన్నికల సంఘం డబ్బు పంపిణీని అడ్డుకోవాలని, పంపిణీ చేసిన, చేస్తున్న అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలింగ్ రోజున విద్యాసంస్థలకు సెలవు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిమిత్తం వినియోగిస్తున్న విద్యాసంస్థలు, కార్యాలయాలకు స్థానిక సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి తెలిపారు. ఆయా విద్యాసంస్థలు, కార్యాలయాల అధిపతులు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పోలింగ్ రోజున స్థానిక సెలవు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 37పోలింగ్ కేంద్రాలున్నాయని, పోలింగ్ కేంద్రాలుగా ఉపయోగించే ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు 27న స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్లు వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 25 ( ఆంధ్రజ్యోతి): వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలన్నారు. పోలింగ్‌కు ముందు 48 గంటలు అనగా.. 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ పోలింగ్ ముగిసే వరకూ సైలెంట్ పిరియడ్ ఉంటుందన్నారు. సైలెంట్ పిరియడ్‌లో సభలు, సమావేశాలు నిర్వహించరాదని, సుమారు 600మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.ఎన్నికలు ముగిసే వరకూ 163 బీఎన్‌ఎ్‌సఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.