Share News

Corruption: మత్స్యకార సభ్యత్వాలకు 20 వేలు లంచం

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:34 AM

మత్స్యకార సొసైటీలో నూతన సభ్యత్వాలను నమోదు చేయడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు.

Corruption: మత్స్యకార సభ్యత్వాలకు 20 వేలు లంచం

  • ఏసీబీకి చిక్కిన నల్లగొండ మత్స్యశాఖ ఏడీ

నల్లగొండ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మత్స్యకార సొసైటీలో నూతన సభ్యత్వాలను నమోదు చేయడం కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ) అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని ఓ మత్స్యకార సొసైటీలో సభ్యత్వాల నమోదు కోసం 17 మంది జిల్లా కలెక్టరేట్‌లోని మత్స్యశాఖ కార్యాలయం చుట్టూ కొన్నిరోజులుగా తిరుగుతున్నారు. వారి అభ్యర్థనను పదేపదే తిరస్కరిస్తూ వచ్చిన మత్స్యశాఖ జిల్లా అధికారి చరితారెడ్డి రూ.70 వేలు ఇస్తేనే సభ్యత్వాలు ఇస్తానంటూ స్పష్టం చేశారు. దీంతో బాధితుడు శ్రీనివాస్‌ రూ.50 వేలు ఇస్తానని ఆమెతో ఒప్పందం కుదుర్చుకుని, గత నెల 29న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.


ఒప్పందంలో భాగంగా గురువారం రూ.20 వేలు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న ఆమె నివాసంలోనూ సోదాలు చేశారు. చరితారెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జగదీశ్‌చందర్‌ తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచాలు డిమాండ్‌ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1064కు సంప్రదించాలని, బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కాగా చరితారెడ్డిపై ఇదివరకే పలు అవినీతి ఆరోపణలున్నాయి. 2016-17 సంవత్సరంలోనూ చేపపిల్లల పంపిణీలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అప్పుడు విజిలెన్స్‌ విచారణను ఎదుర్కొన్నట్లు తెలిసింది.

Updated Date - Sep 05 , 2025 | 04:34 AM