చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాల్సిందే
ABN , Publish Date - Mar 13 , 2025 | 05:18 AM
చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని వారు కోరారు.

బీసీ మేధావుల సదస్సులో తెలుగు ఎంపీల డిమాండ్
న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్ చేశారు. బీసీల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్లపై క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగాలలో బీసీల రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బుధవారం, ఏపీ/తెలంగాణ భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ఓబీసీ డిమాండ్లపై జరిగిన బీసీ మేధావుల సదస్సులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆర్.కృష్ణయ్య, కలిశెట్టి అప్పలనాయుడు, బీద మస్తాన్‌రావు, అంబికా లక్ష్మీనారాయణ, బస్తీపాటి నాగరాజు, వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, ప్రైౖవేటు రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని అప్పలనాయుడు అభిప్రాయపడ్డారు. బీసీ ఉద్యమం కీలక దశకు చేరుకుందని, పార్లమెంటులో బీసీ బిల్లుకు కట్టుబడి ఉన్నామని, ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి పార్లమెంట్‌ల్లో బీసీ బిల్లులకు మద్దతు కూడగడతామని మస్తాన్‌రావు, లక్ష్మీనారాయణ తెలిపారు. 50 శాతం రిజర్వేషన్లు దక్కినప్పుడు మాత్రమే బీసీలకు నిజమైన స్వతంత్రం వస్తుందని బస్తీపాటి నాగరాజు తెలిపారు. బీసీ వాదానికి తమ బీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు.