Share News

Mother Dairy: మదర్‌డెయిరీ అప్పులు 32 కోట్లు!

ABN , Publish Date - Feb 08 , 2025 | 03:02 AM

మదర్‌ డెయిరీకి ఉన్న స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదన్నారు. హయత్‌నగర్‌లోని ‘నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (మదర్‌ డెయిరీ)’ ఆవరణలో 26వ సర్వసభ్య సమావేశం జరిగింది.

Mother Dairy: మదర్‌డెయిరీ అప్పులు 32 కోట్లు!

వడ్డీలకే నెలకు రూ.45 లక్షలు చెల్లిస్తున్నాం

డెయిరీ ఆస్తులు అమ్మడం అనివార్యం

సర్వసభ్య భేటీలో చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

హయత్‌నగర్‌, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మదర్‌ డెయిరీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. రకరకాల కారణాలతో డెయిరీ అప్పులు పెరిగిపోయాయని.. వడ్డీల కింద నెలకు రూ.45 లక్షలు చెల్లిస్తున్నామని డెయిరీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి చెప్పారు. మదర్‌ డెయిరీకి ఉన్న స్థిరాస్తులు అమ్మితే కానీ బయటపడే పరిస్థితి లేదన్నారు. హయత్‌నగర్‌లోని ‘నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్‌ లిమిటెడ్‌ (మదర్‌ డెయిరీ)’ ఆవరణలో 26వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మదర్‌ డెయిరీకి ఉన్న స్థిరాస్తులను అమ్మితే తప్ప డెయిరీని కాపాడుకోలేం. దానికి పాల రైతు సంఘాల అనుమతి, సహకారం కావాలి. డెయిరీని కాపాడుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. అర్థం చేసుకుని సహకరించండి’ అని కోరారు. 2014-2015 వరకు డెయిరీ లాభాల్లో నడించిందన్నారు. ఆ తర్వాత అన్నీ నష్టాలేనని తెలిపారు. నకిరేకల్‌, చిట్యాల, చండూరులోని డెయిరీకి చెందిన స్థిర ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నట్లు వెల్లడించారు. రుణాలు రూ.32 కోట్లకు చేరాయన్నారు. ప్రతి నెల రూ.45 లక్షలు వడ్డీ కింద చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.22 కోట్లు బకాయి పడినట్లు చెప్పారు. ఢిల్లీ మదర్‌ డెయిరీ కాంట్రాక్టు రద్దు అయిన తర్వాతే నష్టాలు వచ్చాయన్నారు. డెయిరీలో 300 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 570 మంది ఉన్నారని, దీని వల్ల నెలకు రూ.1.80 కోట్ల భారం పడుతోందని మధుసూదన్‌రెడ్డి చెప్పారు. ఇలా రకరకాల కారణాల వల్ల డెయిరీ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అయితే ఆస్తుల అమ్మకంపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు రైతులు ఆస్తులు అమ్మకుండా ప్రభుత్వం నుంచి ప్రత్యేక గ్రాంటును తీసుకొచ్చి డెయిరీని నడిపించాలని కోరారు. ఆస్తులు విక్రయిస్తే న్యాయ పోరాటనికీ సిద్ధమని మరికొందరు, పదేళ్లుగా డెయిరీకి నష్టాలు వస్తుంటే పాలక వర్గం ఏం చేస్తోందని ఇంకొందరు ప్రశ్నించారు. ఆస్తులు అమ్మినా డెయిరీ లాభాల్లోకి రాకపోతే ఎవరు భాద్యత వహిస్తారో చెప్పాలని కొందర పలు ప్రశ్నలు సంధించారు.


ఆస్తులు అమ్మక తప్పదు..

నష్టాల నుంచి గట్టెక్కేందుకు డెయిరీ ఆస్తులు విక్రయించాలని, గత సర్వసభ్య సమావేశంలోనే తీర్మానం చేశామని చైర్మన్‌ తెలిపారు. పాడి రైతుల అనుమతి కోసం మరోసారి సర్వసభ్య సమావేశంలో పెడుతున్నామని చెప్పారు. ఇష్టం ఉన్న వారు రిజిస్టర్‌లో సంతకం పెట్టాలని కోరారు. డెయిరీ ఆస్తులు బ్యాంకులు జప్తు చేస్తే తక్కువ ధర వస్తుందని, ఇది రైతులకే నష్టమని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో డెయిరీ ఆస్తుల్ని పాలకవర్గం ఆధ్వర్యంలోనే అమ్మితే అధిక ధర వస్తుందని, దాంతో అప్పులు చెల్లించి, మిగిలిన సొమ్ముతో డెయిరీని నడిపిద్దామని అన్నారు. చిట్యాల, మిర్యాలగూడ ఆస్తులు అమ్మితేనే సుమారు రూ.55 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆస్తుల విక్రయంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని, పది మందితో కమిటీ వేస్తామని చెప్పారు.

పాలకవర్గమే బాధ్యత వహించాలి

‘‘డెయిరీ నష్టాల్లో కూరుకుపోవడానికి పాలకవర్గమే బాధ్యత వహించాలి. డిస్ట్రిబ్యూటర్‌కు లాభం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకోరాదు. నష్టానికి కారణాలు తెలుసుకోవాలి. స్థిర ఆస్తులు అమ్మకుండా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. పది రోజులకోసారి పాడి రైతులకు డబ్బులు చెల్లించాలి. నష్ట నివారణపై గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయాలను, సూచనలను తీసుకోవాలి. అవకతవకలు జరిగితే పాలక వర్గాన్ని రద్దు చేస్తామని రాసి ఇవ్వాలి’’ అని పలువురు రైతులు డిమాండ్‌ చేశారు.


ఇవి కూడా చదవండి..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..

Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..

Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 08 , 2025 | 03:02 AM