Share News

Mother Daughter Tragedy: తన బిడ్డ ఏమైపోతుందోననే బెంగతో

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:06 AM

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న పావని, తన కుమార్తె భవిష్యత్తు గురించి ఆందోళనపడుతూ, ఆమెతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, పావని పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది

Mother Daughter Tragedy: తన బిడ్డ ఏమైపోతుందోననే బెంగతో

  • 4 ఏళ్ల కూతురికి విషమిచ్చి తానూ తాగిన తల్లి

  • చిన్నారి మృతి..చావు బతుకుల మధ్య మహిళ

  • అనారోగ్యాన్ని భరించలేక ఆత్మహత్యాయత్నం

జీడిమెట్ల, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): పుట్టుక నుంచి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఓ తల్లి.. తాను చనిపోతే కుమార్తె ఏమైపోతుందోనన్న బెంగతో బిడ్డతో సహా ఆత్మహత్యకు యత్నించింది. కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి చిన్నారికి తాగించి.. ఆపై తానూ అదే విషాన్ని మింగింది. ఈ క్రమంలో కుమార్తె మృతి చెంద గా.. తల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో జరిగింది. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన నంబూరి సాంబశివరావు.. బాపట్ల మండలం మిన్నేకల్లు గ్రామానికి చెందిన కృష్ణ పావని(33)కి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన నాలుగేళ్లకు వీరికి పాప పుట్టింది. సాంబశివరావు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పావని ఇంటి వద్దనే ఉంటూ కుమార్తెను చూసుకుంటోంది. పావని పుట్టుకతోనే మానసిక వ్యాధితో బాధపడుతోంది.


నరాల బలహీనత, తీవ్ర కోపం వంటి సమస్యలతో ఆమె సతమవుతుండేది. ఇదే వ్యాధి తన కుమార్తె జశ్విని(4) కూడా ఉందన్న అనుమానం పావనిలో బలపడింది. ఈ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న పావని.. తాను మరణిస్తే కుమార్తె భవిష్యత్‌ ఎమవుతుందోనని ఆందోళనకు గురైంది. ఈ క్రమంలో 18న భర్త ఉద్యోగానికి వెళ్లగా.. సాయంత్రం 4.30 గంటల సమయంలో కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి కుమార్తెకు తాగించి, తాను కూడా తాగింది. శనివారం తెల్లవారుజామున తల్లీ కూతుళ్ల పరిస్థితి విషమిస్తుండటంతో భర్తకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. దీంతో పావని జరిగిన విషయం చెప్పింది. వెంటనే సాంబశివరావు తల్లీ బిడ్డలను ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి జశ్విక చనిపోయింది. పావని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Updated Date - Apr 21 , 2025 | 04:06 AM