జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా: అజారుద్దీన్
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:50 AM
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని క్రికెటర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు.
బంజారాహిల్స్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని క్రికెటర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పారు. గురువారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశానని, చివరి క్షణంలో పార్టీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోయానని తెలిపారు. ఆ తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓట్లు జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి నుంచే కాంగ్రె్‌సకు వచ్చాయని తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతం కోసం ఏడాదిన్నర కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికీ పలుమార్లు బూత్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ చాలా బలంగా ఉందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, తనకు టికెట్ ఇవ్వడంలేదని ప్రచారం చేస్తున్నారని, ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు.