Share News

Miss World 2025: తెలంగాణ జీవనశైలిలోనే సౌందర్యం!

ABN , Publish Date - May 24 , 2025 | 03:16 AM

ప్రపంచ సుందరి పోటీదారులు తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కొనియాడారు. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ భావన ఇక్కడి ప్రజల జీవనశైలిలో కనిపించిందని తెలిపారు.

Miss World 2025: తెలంగాణ జీవనశైలిలోనే సౌందర్యం!

  • మహిళల భద్రత, సాధికారతకు ఆదర్శం

  • అభివృద్ధి, ఆత్మీయత, ఆత్మగౌరవానికి రాష్ట్రం ప్రతీక

  • హైదరాబాద్‌ సురక్షిత నగరం: మిస్‌ వరల్డ్‌ పోటీదారులు

  • హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌ ఫైనల్‌లో తెలంగాణపై

  • జడ్జిలు అడిగిన ప్రశ్నలకు అద్భుత సమాధానాలు

  • విజేతలుగా మిస్‌ వేల్స్‌, టర్కీ, ట్రినిడాడ్‌, జాంబియా

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ సుందరి పోటీదారులు తెలంగాణపై ప్రశంసలు కురిపించారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కొనియాడారు. ‘బ్యూటీ విత్‌ పర్పస్‌’ భావన ఇక్కడి ప్రజల జీవనశైలిలో కనిపించిందని తెలిపారు. హైదరాబాద్‌ నగర వీధుల్లో మహిళలు రాత్రి వేళల్లో సైతం భయపడకుండా స్వేచ్ఛగా తిరగగలగడం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఇది ఒక సురక్షిత నగరానికి ప్రతీకగా అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి అందాల భామలు చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రాభవాన్ని ప్రశంసించారు. శుక్రవారం హోటల్‌ ట్రైడెంట్‌లో నిర్వహించిన ‘హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌’ ఫైనల్‌ జరిగింది. యూరప్‌, ఆఫ్రికా, ఆసియా-ఓషియానా, అమెరికా-కరేబియన్‌ల నుంచి ఐదుగురు చొప్పున పాల్గొన్న పోటీదారులు సామాజిక కోణంపై తమదైన శైలిలో జడ్జిలకు సమాధానాలు ఇచ్చారు. ఇందులో మిస్‌ వేల్స్‌, మిస్‌ టర్కీ, మిస్‌ ట్రినిడాడ్‌ టొబాగో, మిస్‌ జాంబియా విజేతలుగా నిలిచారు. ఈ పోటీకి ఎంపికైన 20 మందిలో మిస్‌ ఇండియా నందితా గుప్తా పేరు లేదు.

5.jpg


అద్భుత సమాధానాలు..

తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రతకు సంబంధించి న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు అందగత్తెలు ఉత్సాహంగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతను హక్కుగా గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందన్న విషయాన్ని పలువురు స్పష్టం చేశారు. భద్రత అనేది ఒక హక్కు, దాన్ని అందించడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు. పోలీస్‌ కమాండ్‌, కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించామని.. అక్కడ షీ టీమ్స్‌, హాక్‌ ఐ, నిరంతర పర్యవేక్షణ వంటి సాంకేతిక భద్రతా వ్యవస్థలను పరిశీలించి మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విశేషంగా ఆకర్షించాయని తెలిపారు. తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారని అడిగిన ప్రశ్నలకు అద్భుతంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ సాంకేతికత, వైద్య రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా మహిళల హక్కులు, విద్య, సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యమిచ్చే రాష్ట్రమని పలువురు సుందరాంగులు చెప్పారు. ఇది ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మీయత, ఆదరణ, ఆతిథ్యం ప్రత్యేకంగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు.

  • తెలంగాణలో మహిళల భద్రత- సాధికారతపై ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇస్తారు? అని బ్రెజిల్‌, సురినామ్‌, కేమెన్‌ ఐలాండ్స్‌, గయానా, ట్రినిడాడ్‌ టొబాగో నుంచి వచ్చిన పోటీదారులను న్యాయ నిర్ణేతలు ప్రశ్నించారు. మిస్‌ గయానా స్పందిస్తూ.. ‘‘మహిళలు ఎక్కడికైనా వెళ్లగలరు. భద్రత అనేది హక్కు’ అని చెప్పారు. మహిళలు స్వేచ్ఛగా బతకడానికి అనువైన ప్రదేశం తెలంగాణ అని, రాష్ట్రంలో మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కాంటినెంట్‌ తుది రౌండ్‌ విజేతగా నిలిచిన మిస్‌ ట్రినిడాడ్‌ టొబాగో మాట్లాడుతూ.. ‘ప్రగతి, సాధికారత ఒకటే. భారతదేశం, తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో ఆ దిశగా చేపడుతున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనకబడి ఉంటే విజయం సాధించలేమని మహిళలను ముందుకు నడిపిస్తున్న తెలంగాణకు ధన్యవాదాలు’ అని చెప్పారు.

  • సవాళ్లు ఎదుగుదలకు అవకాశాలుగా ఎలా మారాయి? సోషల్‌ మీడియా పాత్రపై న్యాయ నిర్ణేతలు సంధించిన ప్రశ్నలకు మిస్‌ నమీబియా స్పందిస్తూ.. కుంగుబాటుతనంతో తన వ్యక్తిగత పోరాటం గురించి చెప్పారు. ఎవరికి వారు తనను తాను తెలుసుకొని, బలాన్ని గుర్తించి ముందుకు సాగాలని చెప్పారు. ఆఫ్రికన్‌ కాంటినెంటల్‌ విజేతగా నిలిచిన మిస్‌ జాంబియా.. క్లినికల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి స్కాలర్‌షి్‌పను పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ స్ఫూర్తిదాయక వ్యాఖ్యానం చేశారు. ‘‘ప్రపంచం మారవచ్చు. కానీ, మీరు మారాల్సిన అవసరం లేదు. మీరు మీలాగే ఉండాలి’’ అన్నారు. విద్య ద్వారా యువతను శక్తిమంతం చేసే అంశాలపై అడిగిన ప్రశ్నలకు.. స్పెయిన్‌, వేల్స్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐర్లాండ్‌ ప్రతినిధులు సమాధానం చెప్పారు. మిస్‌ ఐర్లాండ్‌ గృహ హింసకు వ్యతిరేకంగా బలమైన రక్షణకు మద్దతు ఇచ్చారు. మిస్‌ వేల్స్‌ ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రాధాన్యాన్ని వివరించారు. తన కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తి తానేనని పేర్కొన్నారు. ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలను వివరిస్తూ.. యాసిడ్‌ దాడి బాధితుల గాథలు తన లక్ష్యానికి ఎలా స్ఫూర్తినిచ్చాయో తెలిపారు. సాంస్కృతిక గుర్తింపు, వ్యక్తిత్వ సౌందర్యంపై అడిగిన ప్రశ్నలకు శ్రీలంక, థాయిలాండ్‌, టర్కీ, లెబనాన్‌, జపాన్‌ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. మిస్‌ టర్కీ స్పందిస్తూ.. నేటి ప్రపంచంలో సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైందన్నారు. కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమాలతో సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాల ద్వారా మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడడమేగాక ఐక్యతను పెంపొందించుకోగలమని చెప్పారు.


తెలంగాణను ఎలా ప్రోత్సహిస్తారు?

భారతదేశంలోని తెలంగాణను సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా ప్రోత్సహిస్తారు? అనే ప్రశ్నకు.. టర్కీ, వేల్స్‌, జాంబియా, ట్రినిడాడ్‌ టొబాగో ఖండాలవిజేతలు ఆసక్తికరమైన సమాదానాలు చెప్పారు. మిస్‌ టర్కీ తెలంగాణను సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రంగా పేర్కొన్నారు. ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రమని.. సాధికారత, ఆవిష్కరణ, లింగ సమానత్వంపై ప్రపంచానికి బలమైన సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మిస్‌ వేల్స్‌ స్పందిస్తూ.. తెలంగాణ గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు నా దేశాన్ని ఆహ్వానిస్తానన్నారు. మిస్‌ జాంబియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కళలు, సంస్కృతి సంపూర్ణమని అన్నారు. వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు తనకు లభించినట్లు చెప్పారు. మిస్‌ ట్రినిడాడ్‌ టొబాగో మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలకు దయ, కరుణ ఎక్కువని అన్నారు.


ఇవి కూడా చదవండి

Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం

Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్‌ హోల్‌లోంచి..

Updated Date - May 24 , 2025 | 03:16 AM