Miss World 2025: మిస్ వరల్డ్ ఫైనల్స్... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు
ABN , Publish Date - May 28 , 2025 | 06:56 AM
తెలంగాణ రాష్ట్రంలో హైటెక్స్ హాల్ 4లో మిస్ వరల్డ్-2025 తుది పోటీలు జరగనున్నాయి. ప్రముఖులు, సామాన్యులు పాల్గొనే ఈ పోటీలను సోనీ టీవీ 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ప్రత్యేక ఆహ్వానితులుగా పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు
వేయి మంది సామాన్యులు కూడా..
120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం
పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడి
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు ఖండాల నుంచి 40 దేశాల ప్రతినిధులను ఎంపిక చేసిన నిర్వాహకులు.. వచ్చే ఆదివారం సాయంత్రం జరగనున్న ఫైనల్ పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైటెక్స్‌లోని హాల్ నెంబర్-4లో ఈ కార్యక్రమం జరగనుందని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. తుది పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన మంగళవారం సైబరాబాద్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పర్యాటక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని శాఖల మద్య సమన్వయం కోసం హైటెక్స్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సాయంత్రం 6-30గంటలకు కార్యక్రమం ప్రారంభమై 9-20గంటలకు ముగుస్తుందని చెప్పారు. దాదాపు 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో కేవలం ప్రముఖులే కాకుండా సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఇప్పటికే సూచించారు. దీనికోసం ఆన్‌లైన్లో అవకాశం ఇవ్వగా.. దాదాపు 7500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో దాదాపు వెయ్యిమందికి అవకాశం ఇవ్వనున్నామని జయేష్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలతోపాటు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ఫైనల్స్ కార్యక్రమానికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ మంగళవారం ప్రారంభమైందని, ఇది బుధ, గురువారాల్లో కూడా కొనసాగుతుందన్నారు. పూర్తిస్థాయి రిహార్సల్స్ ఈనెల 30, 31వ తేదీ ఉదయం జరుగుతాయని చెప్పారు. తుది పోటీల ప్రత్యక్ష ప్రసారాలు సోనీ టీవీ 120 దేశాల్లో అందించనుందని తెలిపారు. అందులో తెలంగాణ సంస్కృతి, పర్యాటక ప్రాంతాల గురించి 50-60 నిమిషాల పాటు ప్రసారం చేయనున్నారని జయేష్ రంజన్ తెలిపారు. తుది పోటీల్లో వ్యవహరించనున్న న్యాయ నిర్ణేతల వివరాలను మిస్ వరల్డ్ సంస్థ త్వరలో ప్రకటిస్తుందని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News