Vakiti Srihari: బనకచర్లపై మాట్లాడేందుకు సిద్ధం: వాకిటి
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:26 AM
బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. వారంలో కృష్ణా జలాలపైనా ఇవ్వనుందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 2(ఆంధ్రజ్యోతి): బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. వారంలో కృష్ణా జలాలపైనా ఇవ్వనుందని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. బనకచర్లపై ఎక్కడైనా మాట్లాడేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో హరీశ్‌రావు తడబడుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందన్నారు. గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 90కి పైగా వినతులు వచ్చాయని శ్రీహరి తెలిపారు. ఎక్కువగా ధరణి బాధితులే ఉన్నారన్నారు.
ఒక పేదవాడు తన సమస్య పరిష్కారం కోసం నేరుగా మంత్రిని కలిసి విన్నవించే సంస్కృతిని కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకం ద్వారా బీసీల పట్ల ఆ పార్టీ వైఖరి ఏంటో మరోమారు తేటతెల్లమైందన్నారు. ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత.. రైల్ రోకో కార్యక్రమం చేపట్టే ముందు.. ఆమె పార్టీలో బీసీలకు కీలక పదవి గురించి ఆలోచిస్తే మంచిదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీలకు ఇవ్వాలని మంత్రి సూచించారు.