Sridhar Babu: సభ జరగని సమయంలోనే ఆర్డినెన్స్
ABN , Publish Date - Sep 01 , 2025 | 04:21 AM
చట్టసభల సమావేశాలు జరగని సమయంలోనే ఆర్డినెన్స్ తెస్తారని, ఇప్పుడు శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.
కేటీఆర్ వాఖ్యలకు సమాధానమిచ్చిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): చట్టసభల సమావేశాలు జరగని సమయంలోనే ఆర్డినెన్స్ తెస్తారని, ఇప్పుడు శాసనసభలో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం 5 రకాలుగా మాట్లాడుతోందని, గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్‌కు, ఇప్పుడు సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు తేడా ఏంటో చెప్పాలంటూ సభలో చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వాఖ్యలకు ఆయన సమాధానమిచ్చారు. బీసీ బిల్లులపై గవర్నర్ మనసు మార్చుకుని సంతకం చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహరంపై కోర్టుకు వెళ్లేలా బీఆర్‌ఎస్సే ఉసిగొల్పేలా వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
రిజర్వేషన్ల బిల్లుపై మాట్లాడేందుకు గవర్నర్ దగ్గరకు బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఐ, ఎంఐఎం పార్టీలన్నీ కలిసిరావాలని కోరారు. మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై అంకితభావంతో ఉన్నామని చెప్పారు. 42ు రిజర్వేషన్లను ప్రభుత్వం ఇచ్చితీరుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజల డబ్బును కాంగ్రెస్ బిహర్‌కు తరలిస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన విప్ ఆది శ్రీనివాస్.. టీఆర్‌ఎ్‌సను.. బీఆర్‌ఎ్‌సగా మార్చుకుని పంజాబ్, మహారాష్ట్రకు తెలంగాణ డబ్బును తరలించారని ఆరోపించారు.