Share News

Minister Jupalli: వారిని ఉపేక్షించేది లేదు.. కల్తీ కల్లు వ్యవహారంపై మంత్రి జూపల్లి సీరియస్

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:44 PM

హైదరాబాద్‌లో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపుతోంది. కలుషితమైన కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Minister Jupalli: వారిని ఉపేక్షించేది లేదు.. కల్తీ కల్లు వ్యవహారంపై మంత్రి జూపల్లి సీరియస్
Minister Jupalli

హైదరాబాద్‌: నగరంలో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కలుషితమైన కల్లు తాగి 19 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా బాధితుల్లో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపధ్యంలో చికిత్స పొందుతున్న కల్లు బాధితులని మంత్రి జూపల్లి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం బాధితులను నిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న 15 మంది పరిస్ధితి నిలకడగా ఉందన్నారు.


ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌లు సీజ్ చేశామని, కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి కారణమైన వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కల్లు శాంపిల్‌ను కెమికల్ టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపినట్లు వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


అసలేం జరిగిందంటే.. కూకట్‌పల్లి ప్రాంతంలో 19 మంది గత ఆదివారం కల్లు తాగారు. అయితే, మరుసటి ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో 15 మంది చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరూ మృతి చెందారు. అంతేకాకుండా మరో వ్యక్తి ఇంట్లోనే మృతి చెందారు. మృతులు తులసీరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్‌కాలనీకి చెందినవారిగా అధికారులు తెలిపారు.

Updated Date - Jul 09 , 2025 | 03:24 PM