Telangana Health Department: టీవీవీపీలో క్యాడర్స్‌ను తగ్గించవద్దు
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:34 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణ, సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌గా మార్చడం కోసం..
ఆస్కీ సిఫారసులను సవరించాలి
వైద్య ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాలు, మాతాశిశు సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగుల సంఖ్య నిర్ధారణ, సెకండరీ హెల్త్ కేర్ సర్వీసెస్‌గా మార్చడం కోసం ఏర్పాటైన ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా) సిఫారసులు ఉద్యోగుల్లో ఆందోళన రేపేలా ఉన్నాయని వైద్య ఉద్యోగుల ఐక్య వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది.
టీవీవీపీలో క్యాడర్స్‌ను తగ్గించవద్దని పేర్కొంది. ‘టీవీవీపీలో ప్రస్తుతమున్న 117 క్యాడర్స్‌ను 81కు కుదించాలని.. 36 క్యాడర్స్‌కు చెందిన ఉద్యోగాలను ఎత్తేయాలని.. ప్రస్తుతమున్న 12,589 మంది ఉద్యోగులను 11,662కు కుదించాలని అస్కీ నివేదికలో పేర్కొంది. ఈ సిఫారసులను వెంటనే సవరించాలి’ అని ఐక్య వేదిక చైర్మన్ ఎంఎస్ మూర్తి, కన్వీనర్ పరబ్ కుమార్ సర్కారును డిమాండ్ చేశారు.