Exam Results: ఎంపీహెచ్‌ఏ రాత పరీక్ష ఫలితాలు విడుదల
ABN , Publish Date - May 20 , 2025 | 04:46 AM
మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ-ఫిమేల్) పోస్టుల రాత పరీక్షా ఫలితాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది.
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్‌ఏ-ఫిమేల్) పోస్టుల రాత పరీక్షా ఫలితాలను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మొత్తం 1,931 పోస్టులకుగాను 20,600 మంది పరీక్ష రాసినట్లు బోర్డు కార్యదర్శి గోపికాంత్ రెడ్డి వెల్లడించారు. ఎంపీహెచ్‌ఏ పోస్టుల నోటిఫికేషన్ 2023లో విడుదల కాగా ఎన్నికల కోడ్ మూలంగా రాత పరీక్ష నిలిచిపోయింది. అలాగే పోస్టుల సంఖ్య పెంచడంతోపాటు కాంట్రాక్టు పద్ధతిలో ఉన్నవారికి వెయిటేజ్ పెంచాలన్న డిమాండ్ల కారణంగా భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది.
గతేడాది చివర్లో రాత పరీక్ష జరగ్గా తాజాగా మెడికల్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. మరోవైపు ఈ నెల 26న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ) పోస్టుల మెరిట్ జాబితాను బోర్డు విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ పోస్టుల రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా ఇప్పటికే సర్కారీ కొలువున్న వారికి వెయిటేజ్ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటోంది. సలహాలు తీసుకున్నాక స్టాఫ్‌నర్స్, ఫార్మసిస్టు, ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) పోస్టుల మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు.