Raghunandan Rao: ఆ పంచాయితీల్లోకి మేము వెళ్లం
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:07 AM
కేసీఆర్ కుటుంబ, అవినీతి పంచాయితీల్లోకి తాము వెళ్లబోమని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. మోకిలా ప్రాజెక్టు తప్ప కవిత కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదని అన్నారు.
కవిత చాలా చిన్న విషయాలే చెప్పారు
ఎన్నో జీవోల గురించి చెప్పాలి: రఘునందన్‌రావు
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ కుటుంబ, అవినీతి పంచాయితీల్లోకి తాము వెళ్లబోమని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. మోకిలా ప్రాజెక్టు తప్ప కవిత కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదని అన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత చాలా చిన్న విషయాలు మాత్రమే చెప్పారని, ఇంకా ఎన్నోజీవోల గురించి ఆమె చెప్పాల్సి ఉందన్నారు.
బీఆర్‌ఎస్ నేతల అవినీతి, కుటుంబ పాలన పట్ల వ్యతిరేకత వల్లే ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికల్లో తనను గెలిపించారని అన్నారు. గత ఏడాది మార్చి 22న రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావు ఒకే విమానంలో ప్రయాణించడం ద్వారా తనను మెదక్‌లో ఓడించడానికి కుట్ర చేస్తున్నారని తాను అప్పట్లో చెప్పినట్లు వెల్లడించారు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రెడ్డిల అవినీతిపైన ముఖ్యమంత్రి, ఏసీబీ స్పందించాలని, వారు చేసిన పాపపు పనులపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు.