Share News

Bar License Applications: బార్లకు భారీగా దరఖాస్తులు

ABN , Publish Date - Jun 07 , 2025 | 03:18 AM

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో చివరి రోజున దరఖాస్తులు అందించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు.

Bar License Applications: బార్లకు భారీగా దరఖాస్తులు

  • గ్రేటర్‌లో 24 బార్లకు 3200పైగా

  • శుక్రవారం అర్ధరాత్రి దాకా స్వీకరణ

  • మిగిలిన 4 ప్రాంతాల్లో 123 దరఖాస్తులు

  • దరఖాస్తు ఫీజుతోనే 34 కోట్ల ఆదాయం

  • 13న లాటరీ పద్ధతిలో బార్ల కేటాయింపు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బార్ల ఏర్పాటుకు వ్యాపారుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో చివరి రోజున దరఖాస్తులు అందించేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. 24 బార్లకు ఏకంగా 3200పైగా దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకూ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుండగా.. మరో వందకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 బార్లతో పాటు మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, బోధన్‌, జల్‌పల్లి (సరూర్‌నగర్‌) మున్సిపాలిటీల పరిధిలో ఒక్కొక్క బార్‌ ఏర్పాటుకు గత నెలలో ఎక్సైజ్‌ శాఖ దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గత నెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. వ్యాపారుల మధ్య పోటీ వాతావరణం నెలకొల్పడానికి గతానికి భిన్నంగా ఈసారి దేశంలోని ఎక్కడి ఎవరైనా, ఎన్నైనా దరఖాస్తులైనా చేసుకునేందుకు అవకాశం క్పపంచారు. నాలుగు రోజుల క్రితం వరకూ కేవలం 359 దరఖాస్తులే రాగా.. చివరి మూడు రోజులు ముహూర్తాలు బాగుండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ గడువు శుక్రవారం సాయంత్రం 5గంటలకు ముగిసినా.. అధిక సంఖ్యలో వ్యాపారులు రావడంతో అర్ధరాత్రి వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 3200 దరఖాస్తులు అందాయని, మరో వంద వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు.. జల్‌పల్లిలో 49, మహబూబ్‌నగర్‌లో 44, నిజామాబాద్‌లో 15, బోధనలో 15మంది దరఖాస్తు చేసుకున్నారు.


ఆరు రెట్లు ఎక్కువగా..

జీహెచ్‌ఎంసీ పరిధిలో 2021లో 55 బార్ల ఏర్పాటుకు ప్రకటన జారీ చేయగా.. 1320 వరకు దరఖాస్తులు వచ్చాయి. అంటే అప్పట్లో ఒక్కో బార్‌కు సుమారుగా 22 మంది పోటీపడ్డారు. కానీ.. ఈ సారి 24 బార్ల ఏర్పాటుకు 3,200పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. అంటే ఒక్కో బార్‌కు దాదాపు 130మందిపైగా పోటీ పడ్డారు. గతంతో పోలిస్తే దాదాపు 6రెట్లకుపైగా దరఖాస్తులు అందాయి. దేశంలోని ఎక్కడి వారైనా, ఎన్ని దరఖాస్తులైనా సమర్పించే అవకాశం ఇవ్వడం, ప్రకటన జారీ చేసిన తర్వాత 3 వారాలు గడువు ఇవ్వడంతో దరఖాస్తులు భారీ గా వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.లక్ష నిర్ణయించగా.. ఈ సారి రూ.34కోట్లకుపైగా ఆదాయం సమకూరిం ది. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత ఈ నెల 13న లాటరీ పద్ధతిన వ్యాపారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వ్యాపారులు 3నెలల్లో బార్‌ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు.

Updated Date - Jun 07 , 2025 | 03:19 AM