Share News

Bharat Future City: మారూబేనీ పారిశ్రామికవాడకు వేయి ఎకరాలు!

ABN , Publish Date - Aug 06 , 2025 | 04:29 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ ప్యూచర్‌ సిటీ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే తొలి అడుగు పడనుంది. ప్యూచర్‌ సిటీలో తొలి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం చకచక సన్నాహాలు చేస్తోంది.

Bharat Future City: మారూబేనీ పారిశ్రామికవాడకు వేయి ఎకరాలు!

  • మ్యాపులు సిద్ధం చేస్తున్న అధికారులు

  • ప్రభుత్వంతో జపాన్‌ కంపెనీ ప్రతినిధుల భేటీ

  • ఎలకా్ట్రనిక్స్‌, గ్రీన్‌ ఫార్మా, ఏరో స్పేస్‌ రంగాల్లో

  • రూ.వెయ్యి కోట్లకు మించి పెట్టుబడులు!

  • త్వరలో శంకుస్థాపనకు సన్నాహాలు

  • ఫ్యూచర్‌ సిటీలో తొలి అభివృద్ధి కార్యక్రమం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/యాచారం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్‌ ప్యూచర్‌ సిటీ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే తొలి అడుగు పడనుంది. ప్యూచర్‌ సిటీలో తొలి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం చకచక సన్నాహాలు చేస్తోంది. జపాన్‌ వ్యాపార దిగ్గజం ‘మారుబేనీ సంస్థ ఏర్పాటు చేసే అధునాతన పారిశ్రామిక వాడకు భూకేటాయింపు కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. భూ కేటాయింపుకు సంబంధించి ఇటీవల కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. గత ఏప్రిల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ బృందం జపాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యటన తొలిరోజే మారూబేని సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. భవిష్య నగరంలో రూ.1000 కోట్లతో పారిశ్రామికవాడ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ప్రస్తుతం మారుబేని సంస్థ ప్యూచర్‌ సిటీలో ఇంకా భారీ మొత్తాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. సంస్థ తొలుత 600 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తానంది. ఇప్పుడు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా వెయ్యి ఎకరాలు కావాలంటోంది.


దాంతో అధికారులు కసరత్తు మొదలెట్టారు. యాచారం మండలం మేడిపల్లి, నానక్‌నగర్‌, తాటిపర్తి, కుర్మిద్ధ గ్రామాల్లో ఇప్పటికే సేకరించిన 1100 ఎకరాల భూములను ఇటీవల పరిశీలించారు. ఇందులోని వేయి ఎకరాలను మారూబేనీకి కేటాయించాలని నిర్ణయించారు. గత నాలుగు రోజులుగా ఈ భూములను సర్వే చేసి మ్యాపులను సిద్దం చేస్తున్నారు. త్వరలోనే పారిశ్రామికవాడకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మారూబేనీ సంస్థ జపాన్‌లోని ఏడు అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో వివిధ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయోత్పత్తులు, లోహాలు, గనులు, రసాయనాలు, ఇంధన ఉత్పత్తులు, స్థిరాస్తి, మౌలిక సదుపాయాల కల్పన, విమానాలు, మెబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో 50 వేల మందికి పైగా పని చేస్తున్నారు. ప్యూచర్‌ సిటీలోని పారిశ్రామిక వాడలో ఈ సంస్థ ఎలకా్ట్రనిక్స్‌, గ్రీన్‌ ఫార్మా, ఏరో స్పేస్‌, రక్షణ, ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. ప్యూచర్‌ సిటీలో మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మారూబేనీ పారిశ్రామిక వాడేనని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 30 వేల మందికి ఉద్యోగవకాశాలు లభిస్తాయి. ఈ పారిశ్రామికవాడ నుంచి ఏటా రూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.

Updated Date - Aug 06 , 2025 | 04:29 AM