Manjira Barrage: మంజీరా బ్యారేజీకి పగుళ్లు లేవు
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:54 AM
హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు.
ముప్పు లేదు.. సేఫ్ జోన్‌లోనే ప్రాజెక్టు
ఆఫ్రాన్ కొట్టుకుపోవడం నిజమే
రిపేర్లకు రూ.3.50 కోట్లు కేటాయించాం
జూరాల గేట్ల రోప్‌లకు మరమ్మతులు చేయిస్తున్నాం: రాహుల్ బొజ్జా
సంగారెడ్డి రూరల్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జంట నగరాలతో పాటు పరిసర గ్రామాలకు తాగునీటిని అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. మంజీరా బ్యారేజీకి ఎలాంటి పగుళ్లు లేవని, ప్రాజెక్టు సేఫ్ జోన్‌లో ఉందని తెలిపారు. సంగారెడ్డి మండలం కల్పగూర్ సమీపంలోని మంజీరా బ్యారేజీని శుక్రవారం ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జంట నగరాలకు తాగునీరందించే మంజీరా డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. అక్కడక్కడ చిన్నచిన్న మొక్కలు మొలిచాయని వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఏటా చేసే తనిఖీల్లో భాగంగానే రాష్ట్ర ఆనకట్టల భద్రత సంస్థ(ఎస్డీఎ్‌సఓ) మంజీరా డ్యామ్‌ను పరిశీలించిందని చెప్పారు. మంజీరా బ్యారేజీకి పగుళ్లు వచ్చాయనేది అవాస్తవమని పేర్కొన్నారు.
ఆఫ్రాన్ కొట్టుకుపోయిన మాట వాస్తవమేనని, దానికి మరమ్మతులు చేయిస్తామని, ఇందుకోసం రూ.3.5 కోట్లు కేటాయించామని తెలిపారు. మంజీరా బ్యారేజీ పనుల కోసం ఇరిగేషన్ అధికారులతో కలిసి అధ్యయనం చేస్తున్నామన్నారు. ఇక, జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్‌లు విఫలమయ్యాయని, అక్కడ మరమ్మతులు చేస్తున్నారని పేర్కొన్నారు. మంజీరా కట్ట మరమ్మతులను వెంటనే చేయిస్తామని, సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాధాన్యంలో లేదని తెలిపారు. ఈ పర్యటనలో రాహుల్ బొజ్జ వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ జయరామ్ నాయక్, నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు.