Share News

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

ABN , Publish Date - Mar 13 , 2025 | 05:32 AM

మటన్‌ వండలేదని కట్టుకున్న భార్యనే కొట్టి చంపాడు ఓ ఘనుడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం బూరుగుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో జరిగింది.

Mahabubabad: మటన్‌ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త

  • మద్యం మత్తులో దారుణం

  • మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం

  • మాంజాతండాలో ఘటన.. నిందితుడి పరారీ

సీరోలు (మహబూబాబాద్‌ జిల్లా), మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మటన్‌ వండలేదని కట్టుకున్న భార్యనే కొట్టి చంపాడు ఓ ఘనుడు. ఈ దారుణ ఘటన మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం బూరుగుచెట్టుతండా గ్రామపంచాయతీ పరిధిలోని మాంజా తండాలో జరిగింది. మాంజాతండాకు చెందిన మాలోతు బాలుకు అదే తండాకు చెందిన కళావతి (38)తో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు మాంజాతండాలోనే నివాసముంటూ తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం తండాలో ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఆమె అంత్యక్రియల అనంతరం ఓ గొర్రెపోతును కోసి, తలా కొంచెం మాంసాన్ని వారివారి ఇళ్లకు తీసుకుపోయారు. రాత్రి సమయంలో ఆ మటన్‌ను ఇంటికి తీసుకువచ్చిన బాలు, వండాలని భార్య కళావతిని కోరాడు.


అంత రాత్రి సమయంలో మటన్‌ వండే విషయంలో కళావతి అభ్యంతరం చెప్పగా, అప్పటికే మద్యం మత్తులో ఉన్న బాలు ఆమెతో గొడవపడ్డాడు. అది కాస్తా తీవ్రంగా మారడంతో వారి ఇంటికి సమీపంలోనే ఉంటున్న కళావతి తల్లిదండ్రులు కలగజేసుకుని సర్దిచెప్పి, గొడవను సద్దుమణిగేలా చేశారు. వారు తిరిగి వెళ్లాక బాలు భార్యతో మళ్లీ గొడవపడి, తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కళావతి తల్లిదండ్రులు కుమార్తె ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. దీంతో కళావతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడు బాలు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 13 , 2025 | 05:32 AM