Malla Reddy Says Goodbye To Politics: రాజకీయాలు వద్దనుకుంటున్నా..
ABN , Publish Date - Aug 10 , 2025 | 03:35 AM
మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నానని..
బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నా.. ఇక ఏవైపు చూసే పరిస్థితి లేదు : మల్లారెడ్డి
బోయినపల్లి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నానని.. ఇక ఏ పార్టీ వైపు కూడా చూసే పరిస్థితి లేదని చెప్పారు. ‘రాజకీయంగా బీజేపీ వైపా.. తెలుగుదేశం వైపా కాదు.. బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నాను. నాకు ఇప్పుడు 73 ఏళ్లు. నేనిప్పుడు ఏ వైపు చూసేటట్టు లేదు. ఎంపీగా, మంత్రిగా చేశాను. మరో 3 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగుతాను. ఇక రాజకీయాలు వద్దనుకుంటున్నా.. ప్రజా సేవ చేసేందుకు వర్సిటీ, కాలేజీలు నడిపిద్దామనుకుంటున్నా..’ అని వ్యాఖ్యానించారు. రాఖీ వేడుకల అనంతరం మల్లారెడ్డి మాట్లాడారు. తన జీవితంలో రాఖీ పండగ ప్రత్యేకమని, రాఖీ రోజే తన తొలి ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి పాల మల్లారెడ్డిని కాస్తా విద్యావేత్తగా ఎదిగానని చెప్పారు. దేశవ్యాప్తంగా డీమ్డ్ వర్సిటీలు, ఆస్పత్రులు స్థాపించి పేద ప్రజలకు విద్య, వైద్యాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నానన్నారు. ఈ రాఖీ పండగ రోజున అందరికి అందుబాటులో ఉండే విధంగా వన్ హెల్త్ పేరిట మెడికల్ షాప్‌లు, అంబులెన్సులను ప్రారంభిస్తున్నామని తెలిపారు.