Manjira Reservoir: మంజీరా గేట్ల మొరాయింపు
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:35 AM
సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ గేట్లు మొరాయిస్తుండటంతో నీరంతా వృథాగా పోతోంది. ఇటీవలి భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి పోటెత్తిన వరదతో మంజీరా బ్యారేజీ జలకళ సంతరించుకుంది.
వృథాగా దిగువకు నదీ జలాలు
సంగారెడ్డి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి జిల్లాలోని మంజీరా రిజర్వాయర్ గేట్లు మొరాయిస్తుండటంతో నీరంతా వృథాగా పోతోంది. ఇటీవలి భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి పోటెత్తిన వరదతో మంజీరా బ్యారేజీ జలకళ సంతరించుకుంది. వరద ఎక్కువ కావడంతో బ్యారేజీ 4 గేట్లు ఎత్తారు. వరద తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం రాత్రి గేట్లు మూయడానికి ఇంజనీర్లు ప్రయత్నించారు. ఒక గేటు పూర్తిగా కిందకు దిగగా, మూడు గేట్లు అడుగుల దూరంలో ఆగిపోయాయి. శనివారం ఉదయం నుంచి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో నిపుణులను రప్పించి గేట్లకు మరమ్మతు చేసి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నా.. ఫలించకపోవడంతో నీళ్లన్నీ వృథాగా పోతున్నాయి. 1.5 టీఎంసీల సామర్థ్యం గల మంజీరా రిజర్వాయర్ నిండుకుండలా ఉంటేనే రోజూ హైదరాబాద్‌కు 40 మిలియన్ లీటర్ల మంచినీరు ఏడాది పొడవునా పంపే అవకాశముంటుంది. వరద తగ్గడంతో సింగూరు గేట్లు మూసేయగా, మంజీరా బ్యారేజీ గేట్లు కిందకు దిగక బ్యారేజీ ఖాళీ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మంజీరా రిజర్వాయర్‌లో పలు లోపాలున్నాయని ఇటీవల బ్యారేజీని సందర్శించిన ప్రాజెక్టుల భద్రతా మండలి పేర్కొంది.