Share News

Congress High Command: మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 05:54 AM

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలనూ మార్చే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.

 Congress High Command: మంత్రుల శాఖల్లో భారీ మార్పులు

  • పలువురి పొర్ట్‌ఫోలియోలు మారే అవకాశం!

  • ఢిల్లీలో రెండో రోజూ సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు

  • రాహుల్‌, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ

  • సునీల్‌ కనుగోలుతోనూ సుదీర్ఘంగా సమావేశం

  • అధిష్ఠానం పిలుపుతో హుటాహుటిన ఢిల్లీకి ఉత్తమ్‌

  • ఎస్సీ వర్గీకరణ, కులగణనపై రాష్ట్రంలో రెండు

  • బహిరంగ సభలు నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయం

  • రాహుల్‌గాంధీ, ఖర్గేను ఆహ్వానించిన రేవంత్‌రెడ్డి

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురు మంత్రులకు శాఖల కేటాయింపుతోపాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలనూ మార్చే దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్ఠానం పెద్దలతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్‌.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో గంటకు పైగా చర్చించారు. తిరిగి మంగళవారం పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో రెండున్నర గంటలపాటు భేటీ అయ్యారు. ఇందిరా భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రుల శాఖల మార్పు పైనే చర్చించినట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. సీఎం రేవంత్‌తో కలిపి మంత్రివర్గంలో ఇప్పటికే 12 మంది ఉండగా, కొత్తగా మరో ముగ్గురికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో కొత్త మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే అంశంపై నిర్ణయించేందుకుగాను.. ప్రస్తుత ఎవరెవరివద్ద ఏయే మంత్రిత్వ శాఖలు ఉన్నాయనే దానిపై చర్చించినట్లు తెలిసింది. ఇందులో కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులెవరు? వారి పనితీరు ఎలా ఉంది? అనే విషయాలపై రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.


ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ తదితర ప్రధాన శాఖల పనితీరు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ ఇప్పటికే మంత్రులందరి పనితీరుపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి, నిరాశ చెందిన వారి గురించీ అధిష్ఠానంతో రేవంత్‌ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతోపాటు ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్‌లో ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులపైనా చర్చించినట్లు సమాచారం. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండురోజులుగా ఢిల్లీలోనే ఉండి.. అధిష్ఠానం పెద్దలతో వరుసగా సమావేశం కాగా, మంగళవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన హస్తినకు వచ్చారు. దీంతో ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే.. మంత్రుల శాఖల్లో మార్పులు భారీగానే ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభలకు హాజరు కావాల్సిందిగా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలను రేవంత్‌రెడ్డి కోరగా.. వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అలాగే, 11 ఏళ్ల నరేంద్రమోదీ పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ సూచించినట్టు సమాచారం. కాగా, ఇందిరా భవన్‌లో అధిష్ఠానం పెద్దలతో సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు. అనంతరం సాయంత్రం సునీల్‌ కనుగోలుతో రేవంత్‌ సుధీర్ఘంగా సమావేశమైనట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పనితీరు తదితర అంశాలపై వీరి మధ్య కీలక చర్చ జరిగినట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు అన్నీ ఈ వారంలోనే జరిగే అవకాశం ఉందంటున్నారు.


త్వరలోనే మంత్రులకు శాఖల కేటాయింపు: వివేక్‌

త్వరలోనే రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. తనయుడు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి మంగళవారం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిశారు. తనకు క్యాబినెట్‌లో చోటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇందిరా భవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చేతిలోనే మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందన్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించారని, శాఖల కేటాయింపులోనూ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు విషయమై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలతో సీఎం చర్చిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధిష్టానం తనకు సూచించిందని చెప్పారు.

Updated Date - Jun 11 , 2025 | 05:56 AM