Share News

Mahesh Kumar Goud: కవితను కాంగ్రెస్‌లోకి తీసుకోం

ABN , Publish Date - Sep 06 , 2025 | 04:24 AM

కవితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. కవితనే కాదని, అవినీతి మరకలున్న కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరినీ చేర్చుకోబోమన్నారు.

Mahesh Kumar Goud: కవితను కాంగ్రెస్‌లోకి తీసుకోం

పైసలు, పవర్‌ కోసమే కవిత, కేటీఆర్‌ పంచాయితీ.. కాళేశ్వరం విచారణను పక్కదారి పట్టించేందుకే డ్రామా

  • వచ్చే ఎన్నికలూ రేవంత్‌ నాయకత్వంలోనే

  • నాకు మంత్రి పదవి ఇస్తామంటే వద్దన్నా

  • మీడియాతో చిట్‌చాట్‌లో మహే్‌షకుమార్‌గౌడ్‌

  • టీపీసీసీ చీఫ్‌గా నేటితో ఏడాది పూర్తి

హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): కవితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు. కవితనే కాదని, అవినీతి మరకలున్న కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరినీ చేర్చుకోబోమన్నారు. ఈ మేరకు ఏఐసీసీనుంచి ఆదేశాలూ ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కేసీఆర్‌ కుటుంబం ఈ డ్రామా చేస్తోందన్నారు. టీసీసీసీ అధ్యక్షుడిగా శనివారంతో ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న మహే్‌షకుమార్‌గౌడ్‌ సీఎల్పీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రాన్ని హరీ్‌షరావు, సంతో్‌షరావు ఎలా దోచుకున్నారో చెప్పి కవిత మంచిపని చేశారని ఆయన చెప్పారు. అయితే ఆమె ఇప్పుడు మాట్లాడుతున్న విషయాలపై అప్పుడే మాట్లాడి ఉంటే సెల్యూట్‌ చేసేవాళ్లమన్నారు. పైసలు, పవర్‌ కోసమే కవిత, కేటీఆర్‌ల పంచాయితీ జరుగుతోందన్నారు. సీబీఐలో అనేక లోసుగులు ఉన్నాయని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై విచారణకు సీబీఐకి మించి మార్గం లేదన్నారు. సీబీఐ కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతోనే విచారణ చేయిస్తే బద్నాం చేసేవారన్నారు.


ఆ తర్వాతనే స్థానిక ఎన్నికలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ గవర్నర్‌ను కోరామని చెప్పారు. రిజర్వేషన్ల విషయంలో బీసీ బిడ్డల నోటిదాకా వచ్చిన ముద్దను తినకుండా చేసింది కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లేనన్నారు. నిజామాబాద్‌ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించే మహత్తర అవకాశం తనకు దక్కిందన్నారు. వారం, పది రోజుల్లో పార్టీలోని అన్ని కమిటీలూ వేస్తామన్నారు. కార్పొరేషన్‌ పదవుల భర్తీ వచ్చే నెలలో ఉంటుందన్నారు. అక్టోబరు నెలలో పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు ఇన్సూరెన్సు కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. దానం నాగేందర్‌ శాసనసభ సభ్యత్వం పోతుందని తాను అనుకోవట్లేదన్నారు.


వచ్చే ఎన్నికల్లోనూ గెలిచేది మా ప్రభుత్వమే

వచ్చే ఎన్నికల్లోనూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే వెళతామని, ప్రభుత్వాన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనకు మంత్రి పదవి ఇస్తామంటే వద్దని చెప్పానన్నారు. తనకు కులమంటే అభిమానమే కానీ.. కుల పిచ్చి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీసీలు కొన్ని రోజులు కులాన్ని పక్కన పెడితే మంచిదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విషయంలో కొంత గందరగోళం ఉందన్నారు. ఆయన అంశాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. టీపీసీసీ అధ్యక్షునిగా ఈ ఏడాది కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తనకు సహకరించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, పార్టీ అధ్యక్షునిగా తనకు మంచి కెమిస్ట్రీ ఉందన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 04:24 AM