Mahesh Kumar Goud,: 11 ఏళ్ల మోదీ పాలనలో బీసీలకు చేసిందేంటి?
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:45 AM
‘‘రెడ్డి కులంలో పుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువస్తానని ప్రకటించారు. ఓబీసీని అని చెప్పుకుంటున్న మోదీ.. 11 ఏళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారు?’
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దేశంలో కులగణన చేపట్టాలి
42% రిజర్వేషన్ కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలి: టీపీసీసీ చీఫ్
హైదరాబాద్, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): ‘‘రెడ్డి కులంలో పుట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకువస్తానని ప్రకటించారు. ఓబీసీని అని చెప్పుకుంటున్న మోదీ.. 11 ఏళ్ల పాలనలో బీసీల కోసం ఏం చేశారు?’’ అని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో భాగంగా కులగణననూ చేపట్టాలని సవాల్ విసిరారు. దేశ వ్యాప్తంగా బీసీ జనాభా ఎంత ఉందో తేలాక, రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ను కల్పించి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ.. పుట్టుకతో బీసీ కాదని సీఎం రేవంత్ మాట్లాడితే బీజేపీ నేతలు నానా హైరానా పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వాస్తవాన్ని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే చెప్పారని తెలిపారు. మోదీ పుట్టిన గాన్సీ కులాన్ని గుజరాత్ ప్రభుత్వం 1994లో ఓబీసీ కులాల జాబితాలో చేర్చిందని, అంతకు ముందు అది అగ్రకులమేనన్నారు. ‘‘పుట్టుకతోనే బీసీ అయిన బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కష్టపడి పని చేశారు. తీరా ఎన్నికల నాటికి ఆ పదవి నుంచి ఆయన్ను తీసి పడేశారు. బీసీల పట్ల బీజేపీకి ఉన్న ప్రేమ ఇదీ’’ అని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి.. బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారన్నారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్‌గాంధీ కులమేంటని అడుగుతున్నరు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి.. అప్పుడు ఆయన ఇంటికి వెళ్లి కులమేంటని అడగండి. సంతకం పెట్టి మరీ తన కులమేంటో రాహుల్ చెబుతారు’’ అని తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జిగా పని చేసిన దీపా మున్షీదాస్.. క్రమశిక్షణ కలిగిన నేత అని, పార్టీ బలోపేతానికి ఆమె ఎంతగానో కృషి చేశారని మహే్‌షగౌడ్ కొనియాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన చేపడతారా? అని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ప్రశ్నించారు. బలహీన వర్గాల గురుంచి ఆలోచన చేసే గుణం కేవలం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ కుటుంబానికే ఉందన్నారు. కాగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎర్రబెల్లి.. చిలక జోస్యం చెబుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ‘‘ఆయనకు జ్యోతిష్యం తెలిస్తే.. ఫామ్ హౌస్‌లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తడు.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఎప్పుడు జైలుకు వెళతాడో చెప్పాలి’’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఎర్రబెల్లి వ్యాఖ్యల్లో కుట్ర ఉందని, దీనిపై విచారణ చేపట్టాలని డీజీపీకి పీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ ఫిర్యాదు చేశారు.