రెండు రోజుల్లో కొలిక్కి వచ్చేనా..
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:55 PM
శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ఇరుక్కుపోయిన 8 మందిని రక్షించడానికి చేపట్టిన సహాయక చర్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయోననే ఆందోళన నెలకొంది.

- రేపటి వరకు సహాయక చర్యలు పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్
- ఇంకా సొరంగంలో అలాగే ఉన్న బురద... ఐరన్ వ్యర్ధాలు, మట్టి దిబ్బలు
- టీబీఎం కటింగ్‌కు కంపెనీ ఒప్పుకోవడంతో సహాయక చర్యలు ముమ్మరం
- సొరంగంలో ఇరుక్కుపోయిన వారు ప్రాణాలతో బయటపడతారా? అనే సందేహాలు
- రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వారు ప్రాణాలతో తిరిగి రావాలని ఆశలు
- శ్రీశైలం ఆలయంలో వారి క్షేమం కోసం పూజలు చేసిన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
మహబూబ్‌నగర్/దోమలపెంట, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ఇరుక్కుపోయిన 8 మందిని రక్షించడానికి చేపట్టిన సహాయక చర్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయోననే ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు లోపల ఐరన్ వ్యర్థాలు, సిల్ట్, మట్టిదిబ్బల తొలగింపు ప్రక్రియ ప్రా రంభం కాకపోవడం, కీలకమైన కన్వేయర్ బెల్టు కూ డా అందుబాటులోకి రాకపోవడంతో సందేహాలు మ రింత పెరిగాయి. అయితే తాజాగా బుధవారం సా యంత్రం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, 15 ఫీట్ల మేర పేరుకుపోయి న బురద.... 18 టన్నుల వరకు ఉన్న ఐరన్ వ్యర్థాలు 100 మీటర్ల మేర ఉన్న మట్టి దిబ్బలు ఇంత తక్కువ సమయంలో తొలగింపు, బయటకు తరలింపు అసా ధ్యమని భావించవచ్చు. అలాగే కన్వేయర్ బెల్టు ఇం కా మరమ్మతు కాలేదు. అన్నీ పనిచేస్తే కొంత సమ యం ఆదా కావచ్చు. లోకో ట్రెయిన్ ద్వారా బయటకు తేవాలన్నా 14 కిలోమీటర్ల దూరం పోవడానికి, రావడానికి ఒకేదారి ఉండటం, రెండు గంటలపైన సమ యం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ ముగించడం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇప్పటివరకు పలు దఫాలుగా వెళ్లిన బృందాలు టీబీఎం ధ్వంసమైన ప్రాంతాలతో వాటి కింద ఏమైనా ఇరుక్కుపోయారా...? అనే అనుమానాలు వ్యక్తపరిచారు. దీంతో టీబీఎం కటింగ్ అయితే ఒకవేళ వాటి కింద ఏమైనా మృతదేహాలు దొరుకుతాయని ఆశాభావం ఉన్నట్లు తెలుస్తుంది. శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరుగ్గా అప్పటినుంచి ఇప్పటివరకు లోపలకు వెళ్లి పరిశీలించి రావడం మినహా మిగతా పనులేవి చేపట్టలేదు. అలాగే సొరంగంలో కొంత ఎక్కువ అనుభవం ఉన్న సింగరేణి రెస్క్యూ బృందాలను కూడా ఎక్కువగా వినియోగించుకోవడం లేదు. అయితే హార్ట్ రాక్ ఉన్న మైన్స్‌లో వారి శక్తి పనికి వస్తుందనే భావనే వారిని ఎక్కువగా వినియోగించుకోవడం పొవడానికి కారణమని చెప్పవచ్చు.
హెచ్చరించినా పట్టించుకోలే...
ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదం శనివారం ఉదయం షిప్టులో కార్మికులు పనిచేస్తున్నప్పుడు జరిగింది. అయితే అంతకుముందు రోజు రాత్రి షిప్టుకు వెళ్లిన కార్మికులు 3 గంటల సమయంలో పైనుంచి భారీగా 5 ఇంచులు, దిగువ నుంచి దాదాపు 2 ఇంచుల్లో నీరు ఉబికి వస్తుండటంతో గమనించిన కార్మికులు సూపర్‌వైజర్‌కు సమాచారం ఇచ్చి పనికి వెళ్లమని... పైన కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదొక భయపెట్టి కార్మికులను పనిలోకి రాకుండా భయపెడుతున్నారని మందలించారు. హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉదయం షిప్టులో కార్మికులను పంపిన అరగంటలోనే ఈ ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు ఇరుక్కుపోయారు. ఇప్పుడు వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. వారు ప్రాణాలతో బయటపడతారా? అంటే దాదాపు తక్కువ అవకాశాలు ఉన్నట్లే... అసలు మొత్తంగా అవకాశం లేదని కూడా విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ టన్నెల్ ప్రమాదపుఘటనలో ఇరుక్కుపోయిన వారు క్షేమంగా రావాలని ప్రజలు కోరుతున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శ్రీశైలం దేవస్థానంలో ఆ 8 మంది కార్మికులు తిరిగి రావాలని పూజలు చేశారు.
టీబీఎం కటింగ్ నిర్ణయమే ఆలస్యం...
టన్నెల్ బోరింగ్ మిషన్ ఖరీదు దాదాపు రూ. 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా... రెస్క్యూ ఆపరేషన్‌కు ఈ మిషన్ అడ్డంగా మారింది. అయితే మొదట్లోనే ఈ మిషన్‌ను కట్ చేసి రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగించాలని సహాయక బృందాలు సూచించాయి. స్ధానికంగా ఉండే కంపెనీ ప్రతినిధులు ఆ విషయంలో ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సమాచారం. బుధవారం కంపెనీ చైర్మన్ జయప్రకాష్ వచ్చి ఓకే చెప్పడంతో వ్యర్థాల తొలగింపు, ఇరుక్కుపోయిన వారి గుర్తింపు వేగం అయ్యే అవకాశాలు ఉన్నాయి.