ఎక్కడి పనులు అక్కడే
ABN , Publish Date - Jan 23 , 2025 | 12:00 AM
జోగుళాంబ గద్వాల జిల్లా, గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఎక్కవి అక్కడే నిలిచిపోయాయి.
- పెండింగ్‌లో చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణం
- ఎన్నికల ముందు హడావిడిగా పనులు
- గ్రామాన్ని ఖాళీ చేయించిన అధికారులు
- పునరావాస కేంద్రంలో వసతులు కరువు
గట్టు, జనవరి 22 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లా, గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఎక్కవి అక్కడే నిలిచిపోయాయి. పునరావాస కేంద్రంలోనూ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో నిర్వాసితులకు ఇబ్బందులు తప్పడం లేదు. జలయజ్ఞంలో భాగంగా 2005లో అప్పటి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ నిర్మా ణానికి శ్రీకారం చుట్టింది. కానీ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ 2009లో మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. కొందరు స్థానిక నాయకులతో వివాదమే అందుకు కారణమన్న ఆరోపణలున్నాయి. ఆ తర్వాత రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎవరూ పట్టించుకోలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రిజర్వాయర్ పనులను చేపట్టేందుకు సిద్ధమైంది. ఆందోళనలు, నిరసనల మధ్యే అధికారులు చిన్నోనిపల్లిని ఖాళీ చేయించి, గ్రామస్థులను పునరావాస కేంద్రానికి తరలించారు. 2023, మార్చి 18న పోలీసు బందోబస్తు మధ్య పనులను ప్రారంభించారు. కొద్ది రోజులు పనులు కొనసాగాయి. ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. నూతన ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచింది. కానీ ఇప్పటివరకు రిజర్వాయర్ నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రిజర్వాయర్ మట్టికట్ట పెంపు, రివిట్‌మెంట్, తూము, అలుగు కాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది.
సమస్యలతో సహజీవనం
రిజర్వాయర్ నిర్మాణం కోసం ఊరును వదిలేసి, పునరావాస కేంద్రానికి చేరుకున్న గ్రామస్థులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు. ప్రధానంగా పాఠశాల భవనం లేకపోవడంతో షెడ్డులో కొనసాగిస్తున్నారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంగన్‌వాడీ భవనం లేక చిన్నారులు అవస్థలు పడుతున్నారు. మిషన్‌భగీరథ నీరు రావడం లేదు. 50 కుటుంబాలకు పైగా షిప్టింగ్ చార్జీలు ఇవ్వలేదు. ఊరును ఖాళీ చేసేందుకు గ్రామస్థులకు తక్షణ సహాయం కింద ఇవ్వాల్సిన రూ.16,500 ఇంకా చాలా మందికి చెల్లించలేదు. ప్లాట్ల పంపిణీలో జరిగిన తప్పిదాలతో స్థానికుల మధ్య వివాదాలు తలెత్తి పోలీస్‌స్టేషన్‌కు చేరిన సందర్భాలున్నాయి. అలాగే పునరావాస కేంద్రంలో ఖాళీ ప్లాట్లను కొందరు కబ్జా చేస్తుండటం సమస్యగా మారింది. పాత గ్రామం లో ముంపు సమస్య, పునరావాసంలో సౌకర్యాల కొరతతో నిర్వాసితులు సతమతం అవుతున్నారు.
పనులు ఎందుకు చేపట్టడం లేదు
పనులకు అడ్డుకుంటున్నారంటూ మాతో ఊరు ఖాళీ చేయించి, పునరావాస కేంద్రానికి తరలించారు. మేము గ్రామాన్ని వదిలేసి నాలుగు నెలలు అవుతోంది. ఇప్పుడు పనులు చేపట్టడానికి అడ్డంకులు లేవు. అయినా పనులు ఎందుకు చేపట్టడం లేదో అధికారులు, నాయకులు ప్రజలకు సమాధానం చేప్పాలి. పునరావాస కేంద్రంలో సౌకర్యాలు లేక ఇతర గ్రామాల్లో ఉండాల్సి వస్తోంది.
- నర్సింహులుగౌడు, గ్రామస్థుడు
పనులు ప్రారంభించేందుకు చర్యలు
చిన్నోనిపల్లి రాజర్వాయర్ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. బండ్, మట్టి కట్ట పెంపు పనులు, రివిట్‌మెంట్, తూము, అలుగు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చుట్టూ పంట పొలాలు ఉన్నందున మట్టి తవ్వేందుకు ఇబ్బంది కలుగుతోంది. ఈ సంవత్సరం పనులు చేపట్టి, పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
- రైముద్దీన్, ఎస్‌ఈ, నీటిపారుదల శాఖ