ఘనంగా వసంత పంచమి
ABN , Publish Date - Feb 03 , 2025 | 11:28 PM
వసంత పంచమిని పురస్కరించుకొని జిల్లాలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

- పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు
- సరస్వతీదేవి చిత్రపటాలకు పూజలు
- చిన్నారులతో అక్షరాలు దిద్దించిన తల్లిదండ్రులు
నారాయణపేట/మక్తల్/ధన్వాడ/కొత్తపల్లి/ కోస్గి రూరల్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): వసంత పంచమిని పురస్కరించుకొని జిల్లాలోని పలు పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పేట పట్టణంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో సోమవారం తల్లిదండ్రులు తమ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. అంతకు ముందు సరస్వతీదేవి చిత్రపటానికి పాఠశాల అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి పూజలు చేశారు. విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజ్, వీహెచ్‌పీ జిల్లా కన్వీనర్ లక్ష్మయ్యగౌడ్, ప్రధానాచార్యులు దత్తు చౌదరి, దూస సీతారాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మండలంలోని బైరంకొండ, శేర్న పల్లి, అమిన్‌పూర్ గ్రామాల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అదేవిధంగా, మక్తల్ పట్టణంలోని శ్రీసరస్వతీ శిశుమందిర్ పాఠశాల వద్ద సోమవారం సామూహిక అక్షరభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వ హించారు. పాఠశాల ఉపాధ్యక్షుడు కొండ విజయ్‌కుమార్ మాట్లాడుతూ శిశుమందిరాల్లో ఆధ్యాత్మికత, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయన్నారు. చదువు కంటే విద్యార్థుల కు సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు. దేశభక్తి, దైవభక్తి అలవర్చుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారన్నారు. ఈ సందర్భంగా 60 మంది విద్యార్థులకు సామూహిక అక్షరభ్యాసం చేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు రఘుప్రసన్నభట్, కావలి వెంకటేష్, నర్సింహా రెడ్డి, చిట్యాల, ఆంజనేయులు, ఆచార్యులు, విద్యా ర్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ధన్వాడలోని శ్రీసాయి సరస్వతి విద్యా మందిర్‌తో పాటు, అంగన్‌వాడీ కేంద్రాల్లోను వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు నిర్మల, రాణి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలోని శ్రీజ్ఞానజ్యోతి పాఠశాలలో సామూహిక అక్షరా భ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన చిన్నారులకు పూజారి అక్షరాభ్యాసం చేయించారు. కరస్పాండెంట్ కృష్ణా రెడ్డి, హెచ్‌ఎం శివరాజ్, ఉపాధ్యాయులు పాల్గొ న్నారు.
గుండుమాల్ మండల కేంద్రంలోని వికాస్ స్కూల్, సరస్వతి శిశుమందిర్‌లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. శిశుమందిర్‌లో హోమం నిర్వహించి తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఊట్కూర్‌లోని శిశుమందిర్ మాధ్యమిక పాఠ శాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. మూడేళ్లకు పైబడిన చిన్నారులకు ఆర్య సమాజ్ ప్రముఖ్ కనకప్పఆర్యా చేతుల మీదుగా తిలకధారణ చేసి, బియ్యంపై అక్షరాభ్యాసం చేయించారు. అలాగే, బిజ్వార్ గ్రామంలోని అంభ త్రాయ క్షేత్రంలో క్షేత్రం వ్యవస్థాపకుడు స్వామి ఆదిపరాశ్రీ చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చదువుతో పాటు చిన్నారులకు సంస్కారం అందించాలని అప్పుడే హిందుత్వం నిలబ డుతుందని ఆయన పేర్కొన్నారు. మద్యం, మాంసం వదిలిన వారి నాలుక, నుదిటిపైన స్వామి ఆదిపరాశ్రీ మంత్రోపదేశం చేశారు. హాజరైన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు.