Share News

నడిగడ్డలో విషాదం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:53 PM

నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నాయకుడు మందా జగన్నాథ్‌ చికిత్స పొందుతూ ఆదివారం హైద రాబాద్‌లో మృతి చెందారు.

నడిగడ్డలో విషాదం

మాజీ ఎంపీ మందా జగన్నాథ్‌ అస్తమయం

గద్వాల, ఎర్రవల్లి జనవరి 12(ఆంధ్రజ్యోతి) నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నాయకుడు మందా జగన్నాథ్‌ చికిత్స పొందుతూ ఆదివారం హైద రాబాద్‌లో మృతి చెందారు. దీంతో నడిగడ్డలోని ఆయన స్వగ్రామం కొండేరులో విషాద ఛాయలు అలుమకున్నాయి. డాక్టర్‌గా వృత్తిని చేపట్టిని ఆయన అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి నాలుగుసార్లు నాగర్‌కర్నూల్‌ ఎంపీగా , నడిగడ్డ వాసిగా రెండు నియోజకవర్గాల అభివృద్ధికి పెద్దపీట వేశారు.

కుటుంబ నేపథ్యం..

మందా జగన్నాథ్‌ స్వస్థలం జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండ లం కొండేరు గ్రామం. 1951 మే 22న మందా పుల్లయ్య, మందా సవరమ్మలకు జన్మించారు. తండ్రి నాగార్జున సాగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండటంతో ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే సాగింది. సెలవు రోజులలో పనిచేసి చదువుకోసం డబ్బులు సంపాదించి స్వయం కృషితో ఎదిగారు. మందాజగన్నాథ్‌కు భార్య సావిత్రమ్మ ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. పెద్ద కుమార్తె మంద పల్లవి గైనకాలజిస్టుగా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు శ్రీనాథ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేసి షోషల్‌ వర్కర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమారుడు మంద విశ్వనాథ్‌ ఎంబీబీఎస్‌ చదివి డాక్టర్‌ వృత్తి కొనిసాగిస్తున్నారు.

నాగర్జున సాగర్‌లో విద్యాభ్యాసం..

మందా జగన్నాథ్‌విద్యాభ్యాసం నాగార్జున సాగర్‌లో సాగింది. తల్లిదండ్రులు మందా పుల్లయ్య, సవరమ్మలు. తండ్రి నాగార్జున సాగర్‌లో పైలాన్‌ కాలనీలో మెకానికల్‌ విభాగంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండటంతో ఆయన ఎనిమిదో తరగతి వరకు విద్యాభ్యాసం అక్కడేసాగింది. తొమ్మిది, పదో తరగతి వరంగల్‌ జిల్లాలోని సంగంలో సాగింది. నిజాం కళాశాలలో పీయూసీ, ఉస్మానియా కాలేజీలో ఎంబీబీఎస్‌ చదివారు. సూర్యాపేటలో ప్రభుత్వ డాక్టర్‌గా వృత్తిని చేపట్టి, ఎపీఎస్‌పీ 8వ బెటాలియన్‌, ఆ తర్వాత సికిందరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో, ఈఎస్‌టీ ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేశారు.

రాజకీయరంగ ప్రవేశం:

ఎన్‌టీఆర్‌ పిలుపుతో 1996లో టీడీపీలో చేరారు. నాలుగుసార్లు ఎంపీగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు అభివృద్ధికి కృషి చేశారు. తొలిసారిగా 1996లో నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా పోటీచేసి ఎన్నికయ్యారు. మళ్లీ 1999లో రెండో పర్యాయం, 2004లో మూడో సారి ఎన్నికయ్యారు. ఈ దఫలోనే పార్లమెంటులో ఓటింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. ఆ తర్వాత వచ్చిన 2009 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి నాలుగో సారి ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని టీఆర్‌ఎస్‌ పార్టీకి దగ్గరయ్యారు. 2014లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. అదేసమయంలో ఆలంపూర్‌ నియోజవర్గం నుంచి పోటీ చేసిన తనయుడు శ్రీనాథ్‌ కూడా ఓటమి చెందాడు.

ఢిల్లీలో అధికార ప్రతినిధిగా...

2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధిగా కేబినెట్‌ హోదాలో నియమించింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చేస్తూ రాష్ర్టానికి కేంద్ర నిధులు వచ్చే విధంగా కృషి చేశారు. మళ్లీ రెండో సారి బీఆర్‌యస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడ అదే పదవిని కొనసాగించారు.

అభివృద్ధికి కృషి..

మందా జగన్నాథ్‌ నాలుగుసార్లు ఎంపీగా పనిచేశాడు. నేషనల్‌ హైవేలతో పాటు రైల్వే రంగం అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. పెద్దపల్లి వెంకటస్వామితో కలిసి దళిత జాతి జాగృతికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన మృతి నడిగడ్డకు తీరనిలోటు.

Updated Date - Jan 12 , 2025 | 11:53 PM