Share News

పథకాలకు వేళాయె

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:13 PM

రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నాలుగు కీలకమైన సంక్షేమ పథకాలకు ఉమ్మడి జిల్లా కేంద్రంగా శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసా పథకాలను ప్రారంభించనున్నారు.

పథకాలకు వేళాయె
అడ్డాకుల మండలం కందూరు గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి(ఫైల్‌)

నేడు సీఎం చేతుల మీదుగా నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభం

సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచకు ముఖ్యమంత్రి రాక

మొత్తం పథకాలకు ఉమ్మడి జిల్లాలో 2,89,087 మం దరఖాస్తులు

ఉమ్మడి జిల్లాలో అధికంగా ఇందిరమ్మ ఇళ్లకు 1,30,541.. రైతు భరోసాకు 6,320..

రేషన్‌ కార్డులకు 125110.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 27,116..

33,183 ఎకరాలు సాగుకు యోగ్యం కాని భూమిగా గుర్తింపు

మహబూబ్‌నగర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి నాలుగు కీలకమైన సంక్షేమ పథకాలకు ఉమ్మడి జిల్లా కేంద్రంగా శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం చంద్రవంచ గ్రామం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డులు, రైతు భరోసా పథకాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించింది. ప్రజాపాలన, సమగ్ర సర్వే సందర్భంగా వచ్చిన దరఖాస్తులను క్రోడీకరించి.. జాబితాలను సిద్ధం చేశారు. అనర్హుల ఏరివేత, జాబితాలో పేర్లు లేని వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయితే ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు రాగా.. అత్యల్పంగా రైతు భరోసా కోసం ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ దరఖాస్తులను ఫైనల్‌ చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మొదటి విడత కింద కేటాయించగా.. 12 నియోజకవర్గాలకు కలిపి 42 వేల ఇళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం 59 వేల పైచిలుకు దరఖాస్తులు రావడం గమనార్హం. విస్తీర్ణం, నియోజకవర్గాల వారీగా పెద్దగా ఉన్న జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇన్ని దరఖాస్తులు రాలేదు. రేషన్‌ కార్డుల కోసం కూడా అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అంతమందికి కార్డులు ఇవ్వడం సాధ్యమేనా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాదాపు లక్షల్లో రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఎనిమిదేళ్లుగా గత ప్రభుత్వం రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపేయడంతో ఇంత భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు స్పష్టమవుతోంది.

రెండింటికే అత్యధికంగా దరఖాస్తులు

గ్రామ సభల్లో అప్పటికే వచ్చిన జాబితాతోపాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో.. ప్రధానంగా రెండు పథకాలకు దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌ కార్డులకు భారీ సంఖ్యలో దరఖాస్తుఉ వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యధికంగా 13,0541 దరఖాస్తులు రాగా.. మొదటి విడతగా 42 వేల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్‌ కార్డుల కోసం 1,25,110, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం 27,116 దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా పథకం కోసం వనపర్తి జిల్లాలోనే అత్యధిక మంది అర్జీలు పెట్టుకున్నారు. ప్రభుత్వం అనుకున్నట్లు నిధులు విడుదల చేసి.. సంవత్సరానికి 3,500 చొప్పున నియోజకవర్గాల్లో ఇళ్లు మంజూరు చేస్తే వచ్చే మూడేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు అందరికీ పక్కా గృహాలు అందుతాయనే భావన ప్రజల్లో ఉంది. ఇప్పటికే ఏడాది ఆలస్యం కాగా.. వచ్చే బడ్జెట్‌ నుంచి 2027 బడ్జెట్‌ వరకు ఈ పథకం కోసం భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దాదాపు ఉమ్మడి జిల్లా పరిధిలోనే రూ. 6,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇక రైతు భరోసా ఇప్పటికే లబ్ధిదారుల జాబితా ఉండగా.. కొత్తగా 6,320 మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని జిల్లాల కంటే భిన్నంగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రేషన్‌ కార్డులు మినహా మిగతా మూడు పథకాలకు చాలా తక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి.

33,183 ఎకరాల గుర్తింపు

గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, వెంచర్లు, ఇతర వాణిజ్య అవసరాల కోసం వినియోగించిన భూములకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చిందనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములను గుర్తించి, యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భువన్‌ యాప్‌ సాయంతో సర్వే నిర్వహించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో 33,183 ఎకరాలు సాగుకు యోగ్యం కాదని గుర్తించారు. కొత్తగా ప్రారంభించనున్న రైతు భరోసా పథకం నుంచి వాటిని తొలగించి.. సాగుకు యోగ్యమైన భూములు ఉన్న రైతులకు మాత్రమే ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూములను అత్యధికంగా గుర్తించగా.. వనపర్తి జిల్లాలో అత్యల్పంగా గుర్తించారు. ప్రధానంగా వెంచర్లు, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూములు, కొండలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే సాగులో భూమి ఉన్నా లేకున్నా.. సాగుకు యోగ్యంగా ఉంటే మాత్రం వాటిని రైతుభరోసా కింద అర్హత ఉన్నట్లు గుర్తించారు.

నేడు చంద్రవంచకు ముఖ్యమంత్రి రాక

కోస్గి, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని చంద్రవంచ గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు ప్రజా పథకాలను సీఎం ప్రారంభించనున్నారని నారాయణపేట కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె చంద్రవంచలో సభా స్థలం ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. స్టేజీ, పథకాలు ప్రారంభించే స్థలం, సభా స్థలం పరిశీలించి సూచనలు చేశారు. సీఎం వచ్చే రోడ్డు వెంట ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం నారాయణ పేట డీఎస్పీ లింగయ్య హెలిప్యాడ్‌ స్థలాన్ని, రోడ్డు మార్గాన్ని పరిశీలించి సిబ్బందికి మార్గ నిర్దేశం చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాడా అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:13 PM