Share News

మూడేళ్లుగా ముందుకు సాగని పనులు

ABN , Publish Date - Feb 26 , 2025 | 11:27 PM

నాలుగు గ్రామాలకు బీటీ రోడ్డు వేస్తున్నారంటే వాగు దాటే కష్టాలు తీరాయని సంబురపడ్డారు.

మూడేళ్లుగా ముందుకు సాగని పనులు
ముత్యాలంపల్లి దగ్గర కంకర వేసి వదిలేసిన రోడ్డు పరిస్థితి ఇది

- కంకర వేసి వదిలేసిన ముత్యాలంపల్లి రోడ్డు

- గ్రామస్థులకు తప్పని తిప్పలు

- పట్టించుకోని అధికారులు, గుత్తెదారు

భూత్పూర్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : నాలుగు గ్రామాలకు బీటీ రోడ్డు వేస్తున్నారంటే వాగు దాటే కష్టాలు తీరాయని సంబురపడ్డారు. అయితే ఇవాళ.. రేపు పనులు ప్రారంభమవుతాయంటూ.. అధికారులు, గుత్తేదారులు ఏకంగా మూడున్నరేళ్లుగా సమయాన్ని వృథా చేస్తూ వస్తున్నారు. మూడేళ్ల క్రితం అధికారికంగా రోడ్డు పనులు ప్రారంభించగా, గుత్తేదారు కంకర వేసి క్యూరింగ్‌ కావాలని వదిలేసి ఏకంగా మూడున్నరేళ్లు అవుతోంది. దీంతో ఈ రోడ్డు మాకొద్దు అంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పోతులమడుగు, ముత్యాలంపల్లి, కప్పెట మీదుగా ఘణపురం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డును బీటీగా మార్చేందుకు 2017లో ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రూ.4.59 కోట్ల వ్యయంతో 11 కిలో మీటర్ల రోడ్డును నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. అయితే జూలై 14, 2021న పనులకు శంకుస్థాపన చేశారు. పోతులమడుగు మీదుగా ముత్యాలంపల్లి, కప్పెట గ్రామాలకు వెళ్లేందుకు కాజ్‌వే నిర్మాణం చేపట్టారు. ఆ రెండు బ్రిడ్జీల పనులు పూర్తి అయ్యాయి. ఇక మిగిలింది బీటీ రోడ్డు వేయడం. ఇందుకోసం ఐదేళ్ల క్రితం టెండర్లు పిలవగా, సదరు గుత్తేదారు పనులు చేయడంలో జాప్యం చేస్తున్నాడని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రారంభిస్తున్నట్లుగా కంకర వేశారు. క్యూరింగ్‌ కావాలి, వర్షాకాలం ఉంది. దసర అనంతరం పనులు చేపడుతామని చెప్పిన గుత్తేదారు ఇంత వరకు పనులు చేపట్టకపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పోతులమడుగు, ముత్యాలంపల్లి గ్రామాలతో పాటు కప్పెట గ్రామాల మీదుగా ఘణపూర్‌ వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కలిపితే భూత్పూర్‌ మీదుగా వచ్చే బాధ తప్పుతుందని, దాదాపు 20 కిలో మీటర్ల దూరం తగ్గుతుందని ప్రజలు ఆశపడి ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. ఎట్టకేలకు రోడ్డు మంజూరు కాగా, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణంచేనా? అన్న చందంగా బీటీ రోడ్డు వేయకుండా వదిలేశారని గ్రామస్థులు ఆంధోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి అసంపూర్తిగా మిగిలిన రోడ్డు పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 11:27 PM