తాత్కాలిక ఉపశమనం
ABN , Publish Date - Feb 15 , 2025 | 11:34 PM
పాలమూరు కార్పొరేషన్ పరిధిలో అద్దె దుకాణాల లెక్క తేలడం లేదు. అద్దె తగ్గించాలని వ్యాపారులు కొన్నేళ్లుగా పైరవీలు చేస్తుండగా, వారికి తాత్కాలిక ఉపశమనం లభించింది. బకాయిలో 25 శాతం చెల్లిస్తేనే దుకాణాల తాళాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఎమ్మెల్యే సూచన మేరకు ఐదు శాతం చెల్లిస్తే తాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు.

అద్దె దుకాణాల బకాయిలో ఐదు శాతం చెల్లిస్తే షాప్‌లు ఓపెన్ చేస్తామన్న అధికారులు
తర్వాత వెళ్లి రూ.ఐదు లక్షలు చెల్లించాలని డిమాండ్
ఐదు లక్షలా? ఐదు శాతమా? అధికారులు, వ్యాపారుల మధ్య దోబూచులాట
ఎమ్మెల్యేను ఆశ్రయించిన వ్యాపారులు.. ఐదు శాతం చెల్లింపునకు అంగీకారం
మార్చి 31 వరకు పూర్తిగా చెల్లించాలంటున్న అధికారులు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): పాలమూరు కార్పొరేషన్ పరిధిలో అద్దె దుకాణాల లెక్క తేలడం లేదు. అద్దె తగ్గించాలని వ్యాపారులు కొన్నేళ్లుగా పైరవీలు చేస్తుండగా, వారికి తాత్కాలిక ఉపశమనం లభించింది. బకాయిలో 25 శాతం చెల్లిస్తేనే దుకాణాల తాళాలు ఇస్తామని చెప్పిన అధికారులు ఎమ్మెల్యే సూచన మేరకు ఐదు శాతం చెల్లిస్తే తాళాలు ఇచ్చేందుకు అంగీకరించారు. అద్దెబకాయిలు ఏకంగా రూ.21 కోట్లకు చేరడంతో అధికారులు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. చివరకు గడియారం చౌరస్తాతోపాటు మార్కెట్‌లో రోడ్‌లో పది రోజుల క్రితం దుకాణాలను సీజ్ చేశారు. మొదటిసారిగా పది రోజుల పాటు దుకాణాలు మూతపడటంతో గడియారం చౌరస్తాలో కర్వ్ఫూ వాతావరణం కనిపిస్తోంది. బకాయిలో 25 శాతం చెల్లిస్తేనే దుకాణాల తాళాలు ఇస్తామని నగరపాలక సంస్థ అధికారులు తేల్చిచెప్పడంతో మళ్లీ వ్యాపారులు నాయకులను ఆశ్రయించారు. చివరకు ఐదు శాతమైనా చెల్లించాలని అధికారులు పట్టుబడుతుండగా అంతమొత్తం కూడా చెల్లించలేమని వ్యాపారులు వాపోతున్నారు. చివరకు ఎమ్మెల్యే వద్దకు పంచాయతీ చేరింది. వ్యాపారులతో మాట్లాడిన ఆయన ఐదు శాతం చెల్లించి, బకాయిలను సెటిల్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అధికారులకు ఇదే విషయం చెప్పడంతో శుక్రవారం ఉదయం దుకాణాలు మూత పడిన పలువురు వ్యాపారులు అద్దె బకాయి మొత్తంలో ఐదు శాతం చెక్కుల రూపంలో ఇచ్చి, తాళాలు తీసుకుని దుకాణాలను తెరుచుకున్నారు. తీరా సాయంత్రం అధికారులు దుకాణాల వద్దకు వెళ్లి రూ.5 లక్షలు చెల్లించాల్సిందేనని, ఉన్నతాధికారుల ఆదేశాలున్నాయని దుకాణాలను మూ యించడంతో వ్యాపారులు కంగుతినాల్సి వచ్చింది. నలుగురు మెడికల్ దుకాణాల వ్యాపారులు మాత్రం రూ.ఐదు లక్షలు చెల్లించి దుకాణాలు మూయకుండా ఆపుకున్నారు. మిగతా వ్యాపారులు చేసేదిలేక దుకాణాలను మూసి, వెళ్లిపోయారు. వ్యాపారులు మరోమారు ఎ మ్మెల్యే దగ్గరికి వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అధికారులకు ఫోన్ చేసి ఇదివరకే చెప్పాను కదా అని మళ్లీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ సీరియ్‌సగా చెప్పినట్లు తెలిసింది. ఐదు శాతం చెల్లింపులు చేసిన వాటికి తాళాలివ్వాలని చెప్పడంతో ఐదు శాతం డబ్బులు చెక్కుల రూపంలో కాకుండా డీడీల రూపంలో ఇవ్వాలని అధికారులు సూచించారు. దీంతో సాయంత్రానికి ఒకరిద్దరు చెల్లింపులు చేసి, తాళాలు పట్టుకెళ్లారు. ఆదివారం మరికొన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుతానికి వ్యాపారులకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ప్రస్తుతం ఐదు శాతం చెల్లించిన వాటికి అనుమతి ఇచ్చిన అధికారులు మార్చి 31 డెడ్‌లైన్ విధించారు. మార్చి 31 నాటికి పూర్తి బకాయి చెల్లించాలని, లేదంటే మళ్లీ దుకాణాలు మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దాంతో వ్యాపారులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. డబ్బులున్న వారు చెల్లిస్తారని, లేనివారం వ్యాపారం మానుకుంటామని వ్యాపారులు చెబుతున్నారు.