Share News

శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం..

ABN , Publish Date - Jan 20 , 2025 | 11:44 PM

కోరిన కోర్కెలు తీర్చే ఇలవేలుపుగా ఊర్కొండపేట అభయాం జనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.

శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం..
ఆంజనేయస్వామి ఆలయం

- కోరిన కోర్కెలు తీర్చే అభయాంజనేయుడు

- ఈనెల 25 నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు

ఊర్కొండ, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : కోరిన కోర్కెలు తీర్చే ఇలవేలుపుగా ఊర్కొండపేట అభయాం జనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. రోగ పీడితులకు ఉపశమనం కలిగించే దేవుడని భక్తులు విశ్వసిస్తారు. ప్రతీ మంగళ, గరు, శని వారాల్లో భక్తులు స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని పూజలు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా, ఊర్కొండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఊర్కొండపేట లో స్వామి వారు కొలువై ఉన్నారు. ఆలయానికి ఇరువైపులా రెండు ఎత్తయిన కొండలున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి ఊరుకొండపేటగా పేరొచ్చిందని స్థానిక పెద్దలు చెప్తుంటారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఒకటవ తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర ప్రాధాన్యం, విశిష్ఠతలు, ఉత్సవాల వివరాలతో ప్రత్యేక కథనం..

కాళికామాత వర్చస్సులో స్వామి వారు

ఆలయంలోని ఆరు అడుగుల ఆంజనేయస్వామి ప్రతిమ కాళికా మాత వర్చస్సులో ప్రకాశిస్తుంటుంది. సాధారణంగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని సింధూర లేపనంతో అలంకరిస్తుంటారు. కానీ ఇక్కడ స్వామి వారికి సింధూర లేపనం ఉండదు. ఎత్తయిన ఆల యం, విశాలమైన ప్రాకారాలతో ఆలయ సముదాయం రాజదర్బారులా కనిపిస్తుంది. కొండపైనున్న గుండంలో భక్తులు పుణ్యస్నానం చేస్తారు. ప్రతీ సంవత్సరం పుష్య మాసంలో చివరి శనివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమై వారం రోజుల పాటు కొనసాగుతాయి. శకటోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమై చక్రతీర్థ స్నా నంతో ముగుస్తాయి. శకటోత్సవం సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు ఎద్దుల బండ్లతో తరలివస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు నల్లగొండ, రంగారెడ్డి, కర్నూల్‌, హైదరాబాద్‌, మెదక్‌, ప్రకాశం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

శకటోత్సవంతో ప్రారంభం

అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్‌ సత్య నారాయణరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి తెలిపారు. 25వ తేదీన ఉదయం ఊర్కొండపేటలోని అర్చకుడు, దివంగత చిరివెళ్లి కృష్ణ మూర్తి శర్మ ఇంటి నుంచి ఉత్సవమూర్తిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, స్వామి వారికి పంచామృ తాభిషేకం, నూతన వస్త్రఽధారణ, వెండి ఆభరణాల అలంకారం తదితర విశేష పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు శకటోత్సవం (బండ్ల ప్రద క్షిణ) జరుగ నున్నది. 26న ఉదయం పంచ సూక్తాలు, సహస్ర నామార్చన అనంతరం స్వామి వారికి గజ వాహన సేవ ఉంటుంది. 27న రాత్రి రథోత్సవం నిర్వ హిస్తారు. 28న రాత్రి పల్లకీసేవ, హరికథ కాలక్షేపం ఉంటాయి. 29న ఉదయం విశేష పూజలు, రాత్రి ఒంటె వాహన సేవ, 30వ తేదీన రాత్రి నెమలి వాహన సేవ, 31న రాత్రి పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి ఒకటవ తేదీన విశేష పూజల అనంతరం 11 గంటలకు చక్ర తీర్థ స్నానం ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి దివంగత చిరివెళ్లి కృష్ణ మూర్తి ఇంటికి చేర్చడంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

Updated Date - Jan 20 , 2025 | 11:44 PM