Share News

గుర్తింపు ఉంటేనే క్రీడా కోటా

ABN , Publish Date - Feb 23 , 2025 | 11:49 PM

క్రీడలు మానసిక వికాసం, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయి.

గుర్తింపు ఉంటేనే క్రీడా కోటా
హ్యాండ్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారులు (ఫైల్‌)

- పుట్టగొడుగుల్లా గుర్తింపు లేని క్రీడా సంఘాలు

- జాతీయ, అంతర్జాతీయ టోర్నీల పేరిట దందా

- ఆటల ఎంపికలో క్రీడాశాఖ సూచనలు పాటించాలి

- సూచిస్తున్న క్రీడాశాఖ అధికారులు, సీనియర్‌ క్రీడాకారులు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : క్రీడలు మానసిక వికాసం, శారీరక దారుఢ్యానికి దోహదపడతాయి. క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటితే ఉజ్వల భవి ష్యత్తు ఉంటుంది. తాను ఎంచుకున్న క్రీడాంశంలో ఎదగాలని ప్రతీ క్రీడాకారుడు ఆశిస్తాడు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే తపనతో ప్రోత్సహిస్తారు. వారి ఆశలు, ఆశయాలను ఆసరాగా చేసుకొని కొన్ని గుర్తిం పు లేని క్రీడా సంఘాలు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల పేరుతో క్రీడాకారులను వంచిస్తున్నాయి. ఆమాయకులైన క్రీడాకారులను ఆసరాగా చేసుకొని ధనార్జనే ధ్యేయంగా వారి బంగారు భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయి. ఎలాంటి ప్రయోజనాలూ లేని క్రీడా ధ్రువపత్రాలను అంటగట్టి పబ్బం గడుపుకుంటు న్నాయి. ఉన్నత స్థాయి పోటీలు అని చెప్తుండటంతో తల్లిదండ్రులు సైతం వేలల్లో వెచ్చిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు గుర్తింపు లేని సంఘాలు నిర్వహించే ఆటల పోటీల్లో పాల్గొని నష్టపోతున్నారు. ఆ టోర్నీల్లో సాధించిన పతకాలు, ధ్రువపత్రాలకు ఉన్నత విద్య, ఉద్యోగాల్లో క్రీడా కోటా ఉండదని తెలుసుకుని బాధపడుతున్నారు.

మోసం చేస్తున్న సంఘాలు

గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు కొత్త దందాకు తెర లేపాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీ లను నిర్వహిస్తూ, వేలాది రూపాయలు వసూ లు చేసి క్రీడాకారులను మోసం చేస్తున్నారు. గత ఏడాది దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ టోర్నీలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడా కారులు పాల్గొన్నారు. ఈ సంఘానికి, ఈ టోర్నీకి ఒలింపిక్‌ సంఘం, అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి ఎలాంటి గుర్తింపూ లేదు. అలాగే ఖేలో భారత్‌ పేరుతో గత ఏడాది నేపాల్‌లో ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నీతో పాటు అథ్లెటిక్స్‌, కరాటే, కబడ్డీ, యోగా, ఫుట్‌బాల్‌, ఖోఖో, హ్యాండ్‌బాల్‌, బ్మాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, తైక్వాండో, వాలీబాల్‌, కిక్‌ బాక్సింగ్‌, హాకీ, స్కేటింగ్‌ పోటీలు నిర్వహించారు. టోర్నీ నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లతో క్రీడాకారులకు ఎర వేశారు. టోర్నీలో ఆడేందుకు పేరు నమోదు చేసుకుంటే రాను పోను రైలు టిక్కెట్‌తో పాటు, వసతి, పర్యాటక ప్రాంతాల సందర్శన అవకాశాలతో ఆకర్షించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారు. కానీ ఈ టోర్నీకి ఒలింపిక్‌ భారత సమాఖ్య, బీసీసీఐల నుంచి గుర్తింపు లేదు.. విషయం తెలియని ఉమ్మడి జిల్లా క్రీడాకారులు పలువురు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ టోర్నీకి వెళ్లి వచ్చారు.

కరాటే పేరుతో నిలువు దోపిడీ

రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో కరాటేకు ఎలాంటి గుర్తింపూ లేదు. పాఠశాలల్లో బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించేందుకు ప్రభుత్వం కొన్ని బాలికల పాఠశాలలను గుర్తించింది. చాలా మంది మాస్టర్లు క్లబ్‌లను ఏర్పాటు చేసుకుని పిల్లలకు కరాటే నేర్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు తీసుకెళ్తున్నామని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వారిచ్చే ధ్రువపత్రాలు దేనికీ పనికి రావు. మహబూబ్‌నగర్‌ లోని కొన్ని కరాటే క్లబ్‌ల మాస్టర్లు కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలను సైతం నిర్వహిస్తుండటం గమనా ర్హం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు గుర్తింపు ఉన్న క్రీడలను ఎంపిక చేసు కుంటేనే భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయంపై వ్యా యామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారికి అవగాహన కల్పించాల్సి ఉంది.

క్రీడా సంఘాలకు గుర్తింపు తప్పని సరి

ఒలింపిక్‌, భారత ఫెడరేషన్‌ గుర్తింపు ఉన్న క్రీడాం శాల్లోనే చిన్నారులను చేర్పించాలి. ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లా పరిధిలో కొన్ని క్రీడా సంఘాలకు మాత్రమే ఒలింపిక్‌ సంఘం, క్రీడా సంఘాల ఫెడ రేషన్‌ గుర్తింపు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో వాలీబాల్‌, ఖోఖో, అథ్లెటిక్స్‌, ఖోఖో, హ్యాండ్‌బాల్‌, ఆర్చరీ, నెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌ తదితర క్రీడాంశాలకు మాత్రమే గుర్తింపు ఉంది. గుర్తింపు లేని క్రీడా టోర్నీల్లో ఆడితే సమయంతో పాటు డబ్బు వృథా అవుతుంది. వాటిలో ఎంత ప్రతిభ చూపినా వారు ఇచ్చే ధ్రువపత్రాలకు విలువ ఉండదు. ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలకు క్రీడా కోటా వర్తించదు. ఇదే సందర్భంలో పలు క్రీడా సంఘాలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కోసం కొట్లాడుతున్నాయి. ఒక్కో క్రీడకు రెండు మూడు క్రీడా సంఘాలు ఉండటంతో, తమకంటే తమకు గుర్తింపు ఉందంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి.

గుర్తింపు ఉంటేనే ప్రయోజనం

క్రీడాకారులు గుర్తింపు ఉన్న క్రీడలను ఎంపిక చేసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. చాలా క్రీడా సంఘాలకు గుర్తింపు ఉండదు. వారు నిర్వహించే జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లి క్రీడాకారులు మోసపోతున్నారు. ఒలింపిక్‌ సంఘం, జాతీయ ఆయా క్రీడా సంఘాల ఫెడరేషన్‌ గుర్తింపు ఉన్న ఆటలే ఆడాలి. జిల్లాలోని క్రీడా సంఘాలు ఎన్నికలు నిర్వహించి తమకు రిపోర్టు చేస్తే గుర్తింపు ఇస్తాం. కరాటే క్రీడకు ఎలాంటి గుర్తింపు లేదు.

- ఎస్‌.శ్రీనివాస్‌, జిల్లా యువజన క్రీడల అఽధికారి మహబూబ్‌నగర్‌

Updated Date - Feb 23 , 2025 | 11:49 PM