పాఠశాలలో షాపింగ్ కాంప్లెక్స్ గొడవ
ABN , Publish Date - Jan 21 , 2025 | 11:27 PM
మహ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాలకు విశాలమైన స్థలం ఉంది.
- 25 ఏళ్లుగా అద్దెలో వ్యాపారులు
- కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేసినా సద్దుమనగని సమస్య
మహ్మదాబాద్ జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : మహ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాలకు విశాలమైన స్థలం ఉంది. ఆ స్థలానికి ఓ వైపు చించోలి హైవే, మరో వైపు గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు ఉంది. ఈ క్రమంలో 25 సంవత్సరాల కిందట పాఠశాలకు వచ్చిన నిధులతో అప్పటి ప్రధానోపాధ్యాయుడు సుమారు 28 పాఠశాల షాపింగ్ కాంప్లెక్స్ భననాలు ఏర్పాటు చేసి, అద్దెకు ఇచ్చారు. ప్రతీ రెండేళ్లకోసారి రీ టెండరింగ్ చేయాలని వ్యాపారులతో రాయించుకున్నారు. కానీ ఇప్పటి వరకు రీ టెండరింగ్ చేయలేదు. ఇక్కడ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. కానీ అప్పట్లో అద్దె తీసుకున్న చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో తమపేరుపై ఉన్న దుకాణాలు ఇతరులకు ప్రతీ నెల రూ.ఐదు లేదా ఆరు వేలకు అద్దెకు ఇచ్చారు. కానీ పాఠశాలకు మాత్రం కేవలం రూ.1,500 చెల్లిస్తున్నారు. గ్రామ యువకులు అన్ని షాపులకు రీ టెండర్ నిర్వహించాలని ఆరు నెలల కిందట హెచ్‌ఎంకు విన్నవించారు. ఈ మేరకు అన్ని షాపులకు నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయకపోవడంతో కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేశారు. అయినా ఖాళీ చేయకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు షాపులు మూయించారు.
అధికారులు దృష్టి సారించాలి
నిత్యం షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో పాఠశాలలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై జిల్లా అఽధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ అంతా పాఠశాల ఆవరణలోనే ఉందని దీన్ని జిల్లా విద్యాశాఖ ఆధీనంలో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, లేకుంటే గ్రామ పంచాయతీకి అప్పజెప్పాలని కోరుతున్నారు. అద్దె ద్వారా వచ్చిన నిధులు సుమారు రూ.20 లక్షలు పాఠశాల బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయని, 2024-25 ఏడాదిలో మహ్మదాబాద్ పాఠశాల ఆవరణ లోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కావడంలో అధ్యాపకుల జీతాల కోసం వాడుతున్నట్లు పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం పాండురంగారెడ్డి తెలిపారు. ఈ విషయమై డీఈవో ప్రవీణ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా అక్కడి ఎంఈవోతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.