శివోహం
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:29 PM
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు.

- శివాలయాలకు పోటెత్తిన భక్తులు
- ఉదయం నుంచి ఆలయాల్లో నెలకొన్న రద్దీ
- సౌకర్యాలు కల్పించిన ఆలయ కమిటీలు
- ఘనంగా శివపార్వతుల కల్యాణ మహోత్సవం
- అభిషేకాలు, స్పర్శ దర్శనం కోసం భక్తుల ఆరాటం
మహబూబ్‌నగర్ న్యూటౌన్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి) : మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బుధవారం వేకువజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. సాంప్రదాయ దుస్తులతో కుటుంబ సమేతంగా ఉపవాస దీక్షలతో భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. వెంట తెచ్చిన పండ్లు, పూలతో అర్చకులచే అభిషేకం, అర్చన, ప్రత్యేక పూజలు చేయించారు. పట్టణంలోని వీరన్నపేట పెద్ద శివాలయంలో భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో పాటు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తాగునీటి సౌకర్యంతో పాటు ఎండవేడిని తట్టుకునేందుకు టెంట్‌లను ఏర్పాటు చేఽశారు. బండమీదిపల్లిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో పల్లె వాసులే కాకుండా సమీపంలోని హనుమాన్‌పుర, గిర్నీగడ్డ, జమ్ములమ్మనగర్ కాలనీ, పాలమూరు విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, జేపీఎన్‌సీ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థినులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీకేరెడ్డి కాలనీ, శివశక్తినగర్, పిల్లల మర్రిలోని పురాతన శివాలయం, కాటన్‌మిల్‌లోని శివాలయంలో భక్తులు శివుడిని దర్శనం చేసుకున్నారు. ఏనుగొండలోని సాంబశివాలయంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్‌నగర్ కొత్తగంజిలోని నీలకంఠ మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి 35వ వార్షికోత్స వేడుకల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి అభిషేకం చేశారు. పట్టణంలోని పురాతన శైవ క్షేత్రాలైన వీరన్నపేట పెద్ద శివాలయం, బీకేరెడ్డి కాలనీలోని శివాలయం, కలెక్టర్ బంగ్లాలోని మౌనేశ్వర ఆలయాల్లో మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తగంజిలోని సింహగిరి లక్ష్మీనరసింహ్మస్వామి ఆలయంలో జనతా సేవ సమితి ఆధ్వర్యంలో భక్తుల జాగరణ కోసం శివపార్వతుల కల్యాణ నాటక ప్రదర్శనతో పాటు, భజన, సాంసృతిక కార్యక్రమాలు చేపట్టారు.