వచ్చేనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు

ABN , First Publish Date - 2025-05-28T23:06:59+05:30 IST

వచ్చేనెల 3 నుంచి 20 వరకు జిల్లాలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు ఆదేశించారు.

వచ్చేనెల 3 నుంచి రెవెన్యూ సదస్సులు
తహసీల్దార్లతో వెబెక్స్‌ నిర్వహిస్తున్న రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, మే 28 (ఆంధ్రజ్యోతి) : వచ్చేనెల 3 నుంచి 20 వరకు జిల్లాలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లతో నిర్వహించిన వెబెక్స్‌లో భూ భారతి రెవెన్యూ సదస్సులు, మీ-సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు, రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల చేరిక, ధాన్యం సేకరణపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణకు తహసీల్దార్లు గ్రామాల వారిగా షెడ్యూల్‌ రూపొందించి కలెక్టర్‌కు పంపాలని ఆదేశించారు. తహసీల్దార్‌, డీటీ ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యుల చేరిక, నూతన రేషన్‌ కార్డులు రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, తహసీల్దార్‌ లాగిన్‌లో ఉన్న వాటిని పరిశీలించి పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రవానా, మిల్లుకు తరలింపులో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్‌కార్డు దారులకు జూన్‌ 1 నుంచి మూడు నెలలకు సంబంధించి కోటా పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ విషయంపై మండల స్థాయిలో చౌకధర దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2025-05-28T23:07:00+05:30 IST