సమస్యలు సత్వరం పరిష్కరించాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:19 PM
సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు.

మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి) :
సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజావాణిలో చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, లేకుంటే ఫిర్యాదుదారుడికి సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్. మోహన్‌రావు, ఆర్డీవో నవీన్ పాల్గొన్నారు.
మా ప్లాట్లను ఆక్రమించుకొని భయపెడుతున్నాడు..
20 ఏళ్ల కిందట సర్వే నెంబరు 435లో 60 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో కొంత మంది ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు నిర్మించుకోలేదు. అయితే ఇళ్లు నిర్మించుకోని ఖాళీ స్థలాన్ని అప్పటి పట్టాదారు అక్రమంగా చదును చేస్తూ భయపెడుతున్నారని భూత్పూర్ మండలం కర్వేన గ్రామానికి చెందిన కుర్మయ్య, అరుణ, నర్సింహులు, శాంతయ్యతో పాటు మరో 12 మంది ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మాకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు.