Share News

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

ABN , Publish Date - Feb 12 , 2025 | 11:33 PM

గ్రామ పంచాయితీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయితీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం నియమించిన స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఆర్‌వోలకు నిర్వహించిన శిక్షణ క్యాక్రమంలో కలెక్టర్‌ పాల్గొని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక సూచనలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందుస్తుగానే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయితీల ఎన్నికల నిర్వహణ బాధ్యతను నిర్వర్తించేందుకు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులకు క్రియాశీలక పాత్ర ఉందని, ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన హ్యాండ్‌ బుక్‌లోని నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేయాలని, ఏమైనా సందేహాలు ఉంటే మాస్టర్‌ ట్రైనర్లను సంప్రదించి అవగాహన పెంచుకోవాలన్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, డీపీవో శ్యాంసుందర్‌, రిటర్నింగ్‌ అధికారులు ఉన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించే హెచ్‌ఎంలపై చర్యలు

అపార్‌(ఏపీఏఏఆర్‌)ఐడీల నమోదు, పీ.ఎం.శ్రీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రధానోపాధ్యాయులపై చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన చాంబర్‌ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... పీఎంశ్రీ పనులను సంబంధించిన నిధులను నిబంధనల మేరకు ఖర్చు పెట్టాలన్నారు. ఏపీఏఏఆర్‌ నమోదులో రాష్ట్రంలో నే వెనుబడిన జోగుళాంబ గద్వాల జిల్లాగా ఉం దని, కేంద్ర పభుత్వం ఆధార్‌కార్డు తరహాలో అపార్‌(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకాడమిక్‌ అ కౌంట్‌ రిజిస్ట్రీ) తీసుకువచ్చిందని, ఇది విద్యార్థులకు ఆధార్‌, పాన్‌కార్డులాగా ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రతి విద్యార్థికి పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును జారీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు గాను పాఠశాలల్లోని విద్యార్థులను మూడు విభాగాలుగా చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు ఈ విషయంలో తక్షణ చర్యలు చేపట్టి జిల్లాలోని అందరు విద్యార్థులకు ఏపీఏఏఆర్‌ జనరేట్‌ చేయాలని, లక్ష్యం మేరకు నమోదు చేయని ప్రధానోపాధ్యాయులు మెమోలు జారీ చేయాలని జిల్లా విద్యాధికారికి కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - Feb 12 , 2025 | 11:33 PM