Share News

దొంగ హామీలతో అధికారం

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:50 PM

దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శిం చారు.

దొంగ హామీలతో అధికారం
మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- రైతుబంధుపై మాటమార్చిన కాంగ్రెస్‌

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

- మాజీ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : దొంగ హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శిం చారు. అధికారంలోకి వచ్చి 420 రోజులైనా ఇచ్చిన హామీలను చేయడం లేదన్నారు. హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ గురువారం మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. అంతకు ముందు మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి గడియారం చౌరస్తాలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, పచ్చగా ఉన్న తెలంగాణను భగ్గున మండేలా చేస్తోందని ఆరోపించారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి ఉందని, హామీలను అమలు చేయలేక స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించపోతోందన్నారు. మన రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని తెలిపారు. అందుకే పథకాల పేరిట దరఖాస్తులను స్వీకరించే డ్రామాలు ఆడుతున్నారన్నారు. రైతుబంధు విషయంలో ముఖ్య మంత్రి మాట మార్చారన్నారు. అర్దరాత్రి నుంచి రైతుల ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడతాయని ఆయన చెప్పినప్పటి నుంచి రైతులు ఫోన్‌లు పట్టుకుని ఎదురు చూస్తున్నారన్నారు. కానీ నాలుగురోజులైనా టకీ లేదు పికీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే రానున్న సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరినీ పోటీలో నిలబెట్టబోమని, ఏకగ్రీవం చేసుకోవాలని సవాల్‌ విసిరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పల్లీ రైతులు మద్దతు ధర లేక ఆందోళనలు చేస్తున్నారని, ఆటోడ్రైవర్లు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, రహమాన్‌, శివరాజు, కరుణాకర్‌గౌడ్‌, దేవేందర్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్‌ రెడ్డి, ప్రవీణ్‌, జములయ్య, నవకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:50 PM